హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఇటీవల పట్టుబడ్డ పేకాట వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నిందితుడు గుత్తా సుమన్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ జరుపుతుండగా.. ఆయన నుంచి కీలక విషయాలను పోలీసులు రాబడుతున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేకాట నిర్వహకుడైన సుమన్.. ఇక్కడి ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులతో తరచూ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పేకాట శిబిరాలకు ప్రజాప్రతినిధులను, ఇతర రంగాల్లోని ప్రముఖులను ఆయన ఆహ్వానించినట్లుగా గుర్తించారు. వాట్సప్ ద్వారా గుత్తా సుమన్ మెసేజ్‌లు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


Also Read: Gold-Silver Price: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల


అంతేకాకుండా, గుత్తా సుమన్.. గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించాడని తేల్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని క్యాసినోలకు తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. గోవాకు బదులు నగర శివారులో గుత్తా పేకాట శిబిరాలు కూడా ఏర్పాటు చేశాడు. ఫాం హౌసుల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, పేకాట శిబిరాల ఏర్పాటు చేసేవారు. అయితే, ఎప్పట్నుంచి ఈ పేకాట దందా నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 


అయితే, తాజాగా పట్టుబడ్డ ఈ ఫాంహౌజ్ హీరో నాగశౌర్య తండ్రికి చెందినదనే సంగతి తెలిసిందే. ఆయన వద్ద నుంచి గుత్తా సుమన్ ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్నారు. ఆ అగ్రిమెంట్‌ను కూడా నాగశౌర్య తండ్రి పోలీసులకు సమర్పించారు. ఇంకోవైపు, గుత్తా సుమన్ అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఇతర కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.


పేకాట ఆడుతున్న 30 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఫామ్ హౌస్ లోని రెండు ఫ్లోర్లలో పేకాట కోసం ఏడు టేబుల్స్ ఏర్పాటు చేసి పేకాట ఆడిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఫామ్ హౌస్ లోని రెండో ఫ్లోర్ లో నాలుగు టేబుల్స్, మూడో ఫ్లోర్ లోని మూడు టేబుల్స్ ఏర్పాటు చేసి ఆడిస్తున్నట్లు తేలింది. గుత్తా సుమన్ స్వయంగా మిగిలిన 29 మందిని పిలిచి పేకాట ఆడించినట్లు తేలింది. ఈ పేకాట క్లబ్‌కు రావాలంటే ఎంట్రీ ఫీజు రూ.20 వేల వరకూ ఉంటుందని పోలీసులు చెప్పారు.


Also Read: Hyderabad: ఇదెక్కడి చోద్యం!! ఒకే నెంబరుతో మూడు ఆర్టీసీ బస్సులు.. ఎలా బయటపడిందో తెలుసా?


Also Read: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ