ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021లో రెండు జట్ల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. గెలిచే సత్తా.. పోరాడే ఆటగాళ్లూ ఉన్నా దురదృష్టం మాత్రం వీరిని వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే సెమీస్‌ చేరేందుకు ఆ రెండు జట్లు మరో రెండు జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ నేపథ్యంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ పంచుకున్న ఓ మీమ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది!


గ్రూప్‌ వన్‌లో నేడు ఆఖరి లీగు మ్యాచులు జరుగుతున్నాయి. పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఇంగ్లాండ్‌, ఆరు పాయింట్లతో ఆస్ట్రేలియా వరుసగా 1,2 స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా సైతం 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. శనివారం ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో ఆసీస్‌ తలపడుతున్నాయి. ఆసీస్‌కు తాను గెలవడం ఎంత ముఖ్యమో సఫారీలు ఓడిపోవడం అంతకన్నా ముఖ్యం. ఒకవేళ ఆంగ్లేయులపై బవుమా సేన గెలిచి కాస్త రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటే కంగారూల ఆశలు అడియాశలే అవుతాయి.






ఇక గ్రూప్‌లో టీమ్‌ఇండియా పరిస్థితీ ఇలాగే ఉంది. సోమవారం నమీబియాపై గెలుపు కన్నా ఆదివారం న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్‌ ఓడించాలని కోరుకుంటోంది. అలా జరిగితేనే కోహ్లీసేన సెమీస్‌ చేరుతుంది. పట్టికలో న్యూజిలాండ్‌ 6, భారత్‌ 4 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. నమీబియాపై గెలిస్తే కోహ్లీసేన ఖాతాలో 6 పాయింట్లు చేరతాయి. కానీ ఆదివారం అఫ్గాన్‌ గెలిస్తేనే మనకు ఉపశమనం. అప్పుడు కివీస్‌, అఫ్గాన్‌ సైతం 6 పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు పాక్‌తో పాటు సెమీస్‌ చేరుతుంది.


ఈ రెండు నేపథ్యాలకు సరిపోయే ఓ చిత్రాన్ని వసీమ్‌ జాఫర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. బాలీవుడ్‌ సినిమా 'దమ్మాల్‌'లోని ఓ చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు. అందులో ఇద్దరికి ఉరి బిగిస్తారు. వారిద్దరూ మరో ఇద్దరి భుజాలపై ఉన్నారు. వారు కాస్త కదిలినా పై వాళ్లకు చావు తప్పదు! భారత్‌, ఆసీస్‌ ప్రాణాలు కిందున్న ఇంగ్లాండ్‌, అఫ్గాన్‌పై ఆధారపడి ఉన్నట్లు అందులో చూపించడంతో ఈ మీమ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.


Also Read: T20 WC Standings: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!


Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!


Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం


Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి