స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 86 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కుప్పకూలిన స్కాట్లాండ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. భారత పేసర్లు బుమ్రా, షమీ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లేలోనే ఓపెనర్లు జార్జ్ మున్సే (24: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), కైల్ కోట్జర్‌ల (1: 4 బంతుల్లో) వికెట్లను స్కాట్లాండ్ కోల్పోయింది. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో స్కాట్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు మాత్రమే చేసింది. పవర్‌ప్లేలో ఇద్దరూ చెరో వికెట్ తీయడంతో పాటు.. చెరో మెయిడెన్ ఓవర్ కూడా వేశారు.
ఆ తర్వాత వికెట్లు తీసే బాధ్యతను జడేజా తీసుకున్నాడు. తన మొదటి ఓవర్లోనే మ్యాథ్యూ క్రాస్ (2: 9 బంతుల్లో), రిచర్డ్ బెరింగ్టన్‌లను (0: 5 బంతుల్లో) స్కాట్లాండ్ అవుటయ్యాడు. ఆ తర్వాత లీస్క్ (21: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), మాక్‌లియొడ్ (16: 28 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఈ దశలో దూకుడుగా ఆడుతున్న లీస్క్ వికెట్‌ను తీసి జడేజా మళ్లీ స్కాట్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. దీంతో స్కాట్లాండ్ 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
14వ ఓవర్లలో గ్రీవ్స్‌ను (1: 7 బంతుల్లో) అవుట్ చేసి అశ్విన్ మొదటి వికెట్ దక్కించుకున్నాడు. ఇక షమీ వేసిన 18 ఓవర్లో మొదటి మూడు బంతుల్లోనే మూడు వికెట్లు పడ్డాయి. అయితే రెండో బంతికి షరీఫ్ (0: 1 బంతి) రనౌట్ అవ్వడంతో హ్యాట్రిక్ అవకాశం దక్కలేదు. తర్వాతి ఓవర్లో మార్క్ వాట్‌ను (14: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) బుమ్రా అవుట్ చేసి స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌కు ఎండ్ కార్డ్ వేశాడు. భారత బౌలర్లలో జడేజా, షమీ మూడేసి వికెట్లు తీశారు. బుమ్రాకి రెండు, అశ్విన్‌కు ఒక వికెట్ దక్కాయి. 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన జడేజా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
అదరగొట్టిన ఓపెనర్లు
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ శర్మ (30: 16 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓవర్‌కు 14 పరుగులు చొప్పున పరుగులు చేశారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు కేవలం ఐదు ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు. ఐదో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఆరో ఓవర్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ కూడా అదే ఓవర్లో అవుటైనా.. సూర్యకుమార్ యాదవ్ (6: 2 బంతుల్లో) కళ్లు చెదిరే సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. 6.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోవడం విశేషం.
స్కాట్లాండ్ బౌలర్లలో వాట్, వీల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ నెట్‌రన్‌రేట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా దాటేసి మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం మన నెట్‌రన్‌రేట్ +1.619కు చేరుకుంది. గ్రూప్-2లో ఇదే అత్యధికం. ఇక ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తే.. భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగైనట్లే..
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ