ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12లో పాకిస్థాన్‌ దూసుకుపోతోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది. పసికూన నమీబియాను 45 పరుగుల తేడాతో ఓడించింది. ఓపెనర్లు రిజ్వాన్‌ (79*; 50 బంతుల్లో 8x4, 4x6), బాబర్‌ ఆజామ్‌ (70; 49 బంతుల్లో 7x4) దంచికొట్టారు. ఆఖర్లో హఫీజ్‌ (32*; 16 బంతుల్లో 5x4) వరుస బౌండరీలు బాదేయడంతో మొదట పాక్‌ 189/2 పరుగులు చేసింది. నమీబియా ఛేదనలో క్రెయిగ్‌ విలియమ్స్‌ (40; 37 బంతుల్లో 5x4, 1x6) డేవిడ్‌ వీస్‌ (43*; 30 బంతుల్లో 3x4, 2x6) ఆకట్టుకున్నారు.


నమీబియాను ఆలౌట్‌ చేయలేదు!


పాక్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ నమీబియా చేసిన పోరాటం ఆకట్టుకుంది. మంచు కురుస్తున్న వేళ ఆ జట్టు బౌలర్లను నమీబియా బ్యాటర్లు పరీక్షించారు. 8 పరుగుల వద్దే మైకేల్‌ వాన్‌ లింజెన్‌ (4)ను హసన్‌ అలీ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత స్టీఫెన్‌ బార్డ్‌ (29), క్రెయిగ్‌ విలియమ్స్‌ (40; 37 బంతుల్లో 5x4, 1x6) రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం అందించారు. విలియమ్స్‌ చక్కని షాట్లు ఆడాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీ స్టీఫెన్‌ విచిత్రంగా రనౌట్‌ అవ్వడంతో విడిపోయింది. అయితే ఎరాస్మస్‌ (15)తో కలిసి విలియమ్స్‌ మూడో వికెట్‌కు 28 పరుగులు జోడించాడు. స్కోరువేగం పెంచే క్రమంలో వీరిద్దరూ పది పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆలౌట్‌ కాకుండా మ్యాచును గౌరవంగా ముగించారు. డేవిడ్‌ వీస్‌ చెలరేగడంతో  20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి నమీబియా 144/5తో నిలిచింది. అయితే పసికూనను పాక్‌ ఆలౌట్‌ చేయలేకపోవడం కొసమెరుపు! 


దంచికొట్టిన బాబర్‌, రిజ్వాన్‌


టాస్‌ ఓడిన పాక్‌ తమను తాము పరీక్షించుకొనేందుకు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ కఠినంగా ఉండటం, పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలించడంలో నెమ్మదిగా ఆడింది. నమీబియా పేసర్లు పది ఓవర్ల వరకు దుమ్మురేపారు. కట్టుదిట్టమైన బంతులు విసిరారు. దాంతో ఓపెనర్లు బాబర్‌, రిజ్వాన్‌ ఆచితూచి ఆడారు. పవర్‌ప్లేలో కేవలం 29 పరుగులే చేశారు. రిజ్వాన్‌కు బాడీలెంగ్త్‌, ఇన్‌స్వింగర్లు వేయడంతో ఇబ్బంది పడ్డాడు. దాంతో వంద పరుగులు చేసేందుకు పాక్‌ 12.6 ఓవర్లు తీసుకుంది. అర్ధశతకం చేశాక బాబర్‌ను వీస్ ఔట్‌ చేయడంతో 113 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఫకర్‌ జమాన్‌ (5) కాసేపే ఆడాడు. ఫ్రైలింక్‌ అతడిని పెవిలియన్‌ పంపించాడు. 15  ఓవర్లు అయ్యాక హఫీజ్‌తో కలిసి రిజ్వాన్‌ విజృంభించాడు. మంచు మొదలవ్వడంతో సిక్సర్లు బాదేసి 42 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అతడికి తోడుగా హఫీజ్‌ సైతం బౌండరీలు బాదడంతో 20 ఓవర్లకు పాక్‌ 189/2కు చేరుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 26 బంతుల్లోనే 67 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.


Also Read: T20 Worldcup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?


Also Read: T20 World Cup 2021: ఇక అఫ్గాన్ దయ.. టీమ్‌ఇండియా ప్రాప్తం! 'ప్రియమైన శత్రువు' దెబ్బకు కోహ్లీసేన కుదేలు


Also Read: Ind vs Nz T20 WC: బుడగ బతుకుతో ప్రపంచకప్‌ ఆశలు ఛిద్రం..! కుటుంబానికి దూరమై ఇబ్బంది పడుతున్నాం అంటున్న బుమ్రా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి