నెలలుగా బయో బుడగల్లో ఉండటం, కుటుంబానికి దూరమవ్వడం, మానసికంగా అలసిపోవడమే ప్రపంచకప్‌లో ఓటములకు కారణమని టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. బుడగల వల్ల మళ్లీ మళ్లీ ఒకే పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. బౌలర్ల కోసం 20 పరుగులు అదనంగా చేసే క్రమంలో బ్యాటర్లు విఫలమయ్యారని వెల్లడించాడు. భారత జట్టు జూన్ నుంచి బయో బుడగల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
'ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడుతున్నప్పుడు కచ్చితంగా విరామం అవసరం. కానీ మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో తెలిసిందేగా! కరోనా వల్ల బయో బుడగల్లోనే ఉండాల్సి వస్తోంది. అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా శారీరక, మానసిక అలసట వెంటాడుతూనే ఉంది. ఒకే పని మళ్లీ మళ్లీ చేస్తున్నాం. మేం నియంత్రణలో బతుకుతున్నాం' అని బుమ్రా అన్నాడు.
'కొన్నిసార్లు కుటుంబాన్ని వదిలి ఆరు నెలల వరకు దూరంగానే ఉండాల్సి వస్తోంది. అప్పుడప్పుడు ఇవన్నీ మనసులో కదలాడుతుంటాయి. కానీ మైదానంలో ఉన్నప్పుడు అవేమీ పట్టించుకోకూడదు. షెడ్యూలింగ్, టోర్నీలు మా చేతుల్లో ఉండవు. ఏదేమైనా కుటుంబానికి దూరమవ్వడం, బుడగల్లో ఉండటం ఆటగాళ్లను మానసికంగా దెబ్బకొడుతుంది. మమ్మల్ని సౌకర్యంగా ఉంచేందుకు బీసీసీఐ చేయాల్సిందంతా చేసింది' అని బుమ్రా వెల్లడించాడు.
'మరో 20-30 పరుగులు చేసి బౌలర్లకు మేలు చేయాలని బ్యాటర్లు భావించారు. అందుకే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రణాళిక విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులువు అవుతోంది. తొలుత బంతి ఆగి వస్తుండటంతో పుల్‌షాట్లు ఆడి ఔటవుతున్నారు. ఏదేమైనా మంచి, చెడ్డ రోజులు ఉంటాయి. బాగా ఆడుతున్నప్పుడు పొంగి పోవద్దు. ఆడనప్పుడు కుంగిపోవద్దు. వర్తమానంలో ఉంటూ మా ఆటను విశ్లేషించుకొని ముందుకు సాగాలి' అని బుమ్రా పేర్కొన్నాడు.
Also Read: T20 WC 2021: దుబాయ్ వెండితెరపై..! ఫస్టాఫ్ ఫట్టు.. సెకండాఫ్ సూపర్‌హిట్టు! పాత్రధారులు మారారంతే!
Also Read: India, T20 WC Standings: పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే.. ఇంకా అవకాశం ఉంది!
Also Read: ABP LIVE Exclusive: షమీపై మతపరమైన దాడి..! ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్న కోహ్లీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి