ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో టీమ్‌ఇండియా ఓటమి పాలై వారం గడిచింది. ఈ పరాభవం భారత అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది. మ్యాచ్ ముగిశాక మహ్మద్ షమీపై ఆన్‌లైన్‌లో మతపరమైన దాడి జరగడం కెప్టెన్ విరాట్ కోహ్లీని మరింత డిస్టర్బ్ చేసింది. ఈ కఠిన సమయంలో అతడు షమీకి అండగా నిలిచాడు.
ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తన రెండో మ్యాచులో ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడుతోంది. వేదిక దుబాయ్. ఈ మ్యాచుకు ముందు జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఆన్‌లైన్‌లో మతం పరంగా దాడికి గురైన షమీకి ఎలా అండగా నిలిచారని 'ఏబీపీ లైవ్' ప్రశ్నించగా.. 'ఒక వ్యక్తిపై మతం పరంగా దాడి చేయడం అమానవీయం. ఇంతకన్నా ఘోరం మరొకటి లేదు. ఒక ప్రత్యేక సంఘటనపై ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ అవతలి వారిని నొప్పించకూడదు. మతం పరంగా వివక్షకు గురిచేయడం నేను సహించలేను. మతం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం' అని కోహ్లీ అన్నాడు.
'తమ చిరాకు, నిరాశను ప్రజలు ఇలా వ్యక్తం చేస్తున్నారు! వ్యక్తిగతంగా మేం ఎలా ఉంటామన్నది వారికి తెలియదు. మైదానంలో మేం ఎంత శ్రమిస్తామో వారు అర్థం చేసుకోలేదు. కొన్నేళ్లుగా మహ్మద్ షమి టీమ్‌ఇండియాకు ఎన్ని మ్యాచులు గెలిపించాడో వారు అర్థం చేసుకోలేదు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు అతడు మాకు కీలకమైన బౌలర్. ఆటపై ఎంతో ప్రభావం చూపిస్తాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'మహ్మద్ షమీ దేశం కోసం చేసింది గుర్తించకపోతే బయట మాట్లాడే వాటిని మేం అస్సలు పట్టించుకోం. అలాంటి వ్యాఖ్యలను షమీ, నేను, జట్టులో మరెవ్వరూ ఖాతరు చేయం. మేం అతడికి పూర్తిగా అండగా ఉన్నాం. ఈ ఆన్‌లైన్ దాడి వల్ల జట్టులోని సోదరభావం, స్నేహభావం అస్సలు చెదిరిపోవు. మా జట్టు సంస్కృతి ఎంతో బాగుందని కెప్టెన్‌గా కచ్చితంగా చెప్పగలను' అని కోహ్లీ తెలిపాడు.
జస్ప్రీత్ బుమ్రాపై వికెట్లు తీయాల్సిన భారం ఎక్కువైందా అని ప్రశ్నించగా.. 'టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలో బుమ్రా కీలకమైన బౌలర్. అతడితో పాటు ముఖ్యమైన బౌలర్లు మాకు ఉన్నారు. నిజం చెప్పాలంటే అతడిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అతడి భారాన్ని ఇతర బౌలర్లూ పంచుకుంటారు. పాక్ మ్యాచులో మా ప్రణాళికలను మేం పక్కగా అమలు చేయలేకపోయాం. మా వద్ద నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. ప్రపంచంలోని ఏ జట్టునైనా మేం ఓడించగలం' అని విరాట్ స్పష్టం చేశాడు.
Also Read: SL vs SA, Innings Highlight: లంకేయుల విజయం 'కిల్' చేసిన మిల్లర్! ఆఖరి ఓవర్లో వరుస సిక్సర్లు
Also Read: Hasaranga Hattrick in T20 WC: సూపర్ 12 మ్యాచ్‌ల్లో మొదటి హ్యాట్రిక్.. అద్భుతం చేసిన సింహళ స్పిన్నర్!
Also Read: ENG vs AUS, Match Highlights: జోస్ బట్లర్ షో.. ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ విజయం!
Also Read: ICC T20 WC 2021, IND vs NZ Preview: సెమీస్ అవకాశాలు ఉండాలంటే.. 18 ఏళ్ల రికార్డు బద్దలవ్వాల్సిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి