టీ20 వరల్డ్‌కప్‌లో నేడు జరగనున్న మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. మనకే కాదు న్యూజిలాండ్‌కు కూడా ఇది చావోరేవో లాంటి మ్యాచ్. ఎందుకంటే రెండు జట్లూ పాకిస్తాన్ చేతిలో ఒక్కో మ్యాచ్ ఓడాయి. మిగిలిన మ్యాచ్‌లు చిన్న జట్లతోనే కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు సెమీస్‌కు చేరినట్లే. ఓడితే ఇంటికి వెళ్లినట్లే. అయితే భారత్.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి 18 సంవత్సరాలు అయిపోతుంది. టీ20 వరల్డ్ ‌కప్‌లో అయితే ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2007, 2016 సంవత్సరాల్లో టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు పరాజయం ఎదురైంది.


ఆఫ్ఘనిస్తాన్ అలా చేసి ఉంటే?
శుక్రవారం జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో పాక్.. నాటకీయ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. పాక్ విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు సాధించాల్సి ఉండగా.. క్రీజులో ఇద్దరూ కొత్త బ్యాట్స్‌మెనే ఉన్నారు. దీంతో మొగ్గు పాకిస్తాన్ వైపే ఉంది. అయితే ఆసిఫ్ అలీ.. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ విజయం సాధించి ఉంటే.. వాళ్లు కూడా సెమీస్ రేసులోకి వచ్చేవారు. పెద్ద జట్లయిన భారత్, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో విజయం సాధించినా సెమీస్‌కు చేరేది. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడం కూడా ఒకరకంగా భారత్‌కు మంచి చేసినట్లే. పాకిస్తాన్ తర్వాతి మ్యాచ్‌లు నమీబియా, స్కాట్లాండ్‌లతో కాబట్టి.. పాక్ అజేయంగా సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయం అయిపోయింది.


మన బలాలేంటి?
విధ్వంసకరమైన బ్యాటర్లు, పటిష్టమైన బౌలర్లు, ప్రపంచస్థాయి ఫీల్డర్లు టీమిండియా సొంతం. అయితే అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు అవసరం అయినప్పుడు వరుసగా వైఫల్యాలే వెక్కిరిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ, పంత్ మినహా.. మరే బ్యాట్స్‌మెన్ రాణించలేదు. ఇక బౌలింగ్ యూనిట్ పూర్తిగా విఫలం అయింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, రాహుల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, జడేజా, హార్దిక్ అందరూ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నారు. హార్దిక్ పాండ్యా, భువీల్లో ఎవరినైనా పక్కన పెట్టి శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.


న్యూజిలాండ్ ఎలా ఉందంటే?
న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే కీలకం కానున్నారు. బౌలింగ్‌లో కూడా టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, మిషెల్ శాంట్నర్ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. కానీ పాకిస్తాన్ మీద వీరు కూడా విఫలం అయ్యారు. ట్రెంట్ బౌల్డ్ ఇదే పిచ్‌లపై ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కేన్ విలియమ్సన్ ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు.


ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 16 మ్యాచ్‌లు జరగ్గా.. ఇండియా, న్యూజిలాండ్ చెరో ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ వెళ్లే అవకాశం పొందాలని టీమిండియాకు ఏబీపీ దేశం తరఫున ఆల్ ది బెస్ట్!


Also Read: T20 Worldcup 2021: విజయం కావాలా నాయనా.. ముందు ఇక్కడ గెలవాల్సిందే!


Also Read: AFG vs PAK, Match Highlights: పాకిస్తాన్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం


Also Read: Puneeth Rajkumar Death: నువ్విక లేవని తెలిసి.. త్వరగా వెళ్లావని తలచి..! కన్నీటి సముద్రంలో మునిగిన క్రికెటర్లు!


Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్‌ ఇవే! ఐపీఎల్‌ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి