పాకిస్తాన్ మరోసారి మాయ చేసింది. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి తనకు తిరుగులేదనిపించుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 6 బంతులుండగానే చేధించింది. దీంతో పొట్టి ప్రపంచ కప్‌లో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. 


బాబర్ అజామ్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు సాధించి పాక్ ఛేజింగ్‌లో కీలకపాత్ర పోషించాడు. వన్ డౌన్ ఆటగాడు ఫకార్ జమాన్ 30 పరుగులు, సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ 19 పరుగులతో పర్వాలేదనిపించారు. అయితే చివర్లో 12 బంతుల్లో పాక్ విజయానికి 24 పరుగులు అవసరమైన సమయంలో మాలిక్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆసిఫ్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కరీం జనత్ వేసిన 19వ ఓవర్లో పాక్ ఆటగాడు ఆసిఫ్ అలీ నాలుగు సిక్సర్లు బాది ఆఫ్ఘన్ జట్టుపై విజయాన్ని అందించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.


Also Read: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ డిఫెండ్‌ చేసింది..! బంగ్లాపై 3 పరుగుల తేడాతో విండీస్‌ విజయం







అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ను పాక్ బౌలర్లు ఆరంభంలో నియంత్రించినా.. ఆపై పుంజుకున్న జట్టు ఓ మోస్తరు లక్ష్యాన్ని పాక్ ముందు నిలిపింది. రెండో ఓవర్లో హజ్రతుల్లా డకౌట్ కాగా, మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ మహమ్మద్ హెహజాద్ 8 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఓ దశలో 10 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘన్ జట్టు 5 వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసింది. చివర్లో కెప్టెన్ మహ్మద్ నబీ 35, గుల్బదిన్ నయీబ్ 35 పరుగులతో ధాటిగా ఆడటంతో ఆఫ్ఘన్ ఆ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా చివరి 3 ఓవర్లలో ఆఫ్ఘన్ జట్టు బౌండరీల మోత మోగిస్తూ 43 పరుగులు రాబట్టడం విశేషం. కానీ 148 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది.


 

రషీద్ అరుదైన ఘనత
టీ20 ఫార్మాట్లో రషీద్ ఖాన్ 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. పాక్‌ బ్యాటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ను ఔట్‌ చేయడం ద్వారా రషీద్‌ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్‌ నిలిచాడు. రషీద్‌ 53 మ్యాచ్‌లలో వంద వికెట్లు ఫీట్ అందుకున్నాడు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి