ఒకప్పుడు గుమ్మడి లేకుండా పెళ్ళి భోజనాలు కూడా ఉండేవి కాదు. గుమ్మడి సాంబారు కచ్చితంగా కనిపించేది. గుమ్మడి వడియాలు ఆకులో పడాల్సిందే. కానీ ఇప్పుడు కాలం మారింది. గుమ్మడి కాయ దిష్టి తీసి పడేయడానికే వాడుతున్నారు. నిజానికి ఇందులో ఉండే పోషకాలు గురించి తెలిస్తే దీంతో హల్వానో, పచ్చడో, సాంబారో చేసుకుని తింటారు.
మేలైన నిద్రకు
నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడేవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల మెదడు, మనసు ప్రశాంతంగా ఉంటాయి. నిద్ర కూడా బాగా పడుతుంది.
అధిక బరువుకు...
గుమ్మడితో చేసిన హల్వా, వడియాలు, సాంబారులోని గుమ్మడి ముక్కలు, పచ్చడి ఇలా ఏది తిన్నా పెద్దగా కేలరీలు ఒంట్లో చేరవు. అలాగే గుమ్మడి త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. దీనివల్ల అధికంగా తినరు. బరువు కూడా పెరగరు.
రోగనిరోధకశక్తికి...
గుమ్మడిలో గర్బిణులకు అవసరమయ్యే ఫోలేట్, బీటాకెరాటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్ పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి గర్భిణులు గుమ్మడికాయతో సాంబారు లాంటివి చేసుకుని తింటే మంచిది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా గుమ్మడి ముందుంటుంది. కనుక పిల్లలకు కూడా తినిపిస్తే మంచిది.
హైబీపీ ఉన్నవారికి
గుమ్మడి ముక్కల్లో ఉండే పొటాషియం రక్తపోటు తగ్గించేందుకు సాయపడుతుంది. దీనివల్ల పక్షవాతం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. గుమ్మడి గింజలు తినడం కూడా అలవాటు చేసుకోవాలి. వీటిలో కూడా బోలెడన్నీ ఖనిజాలు ఉంటాయి.
కంటికి మంచిది
కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే బీటా కెరాటిన్ గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. బీటాకెరాటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మారి కంటికి రక్షణగా నిలుస్తుంది. కంటి చూపు మెరుగవ్వడమే కాదు, ఇన్ఫెక్ష్లను కూడా రావు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే`
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?