ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ వెస్టిండీస్‌ ఎట్టకేలకు మురిసింది. బంగ్లాదేశ్‌పై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతిని 4 పరుగులు చేయాల్సిన తరుణంలో బంగ్లా పులులు ఒత్తిడికి చిత్తయ్యాయి.143 పరుగుల ఛేదనలో లిటన్‌ దాస్‌ (44), మహ్మదుల్లా (31*) రాణించారు. అంతకు ముందు విండీస్‌లో రోస్టన్‌ ఛేజ్‌ (39), నికోలస్‌ పూరన్‌ (40) అదరగొట్టారు. 


ఆఖరి బంతికి..
బంగ్లాదేశ్‌ ఛేదన ఆసక్తికరంగా సాగింది. ఎందుకంటే షార్జాలో 140+ స్కోరు ఛేదించడం అంత సులభమేమీ కాదు. పైగా ఓపెనర్‌ మహ్మద్‌ నయీమ్‌ (17), షకిబ్‌ అల్‌ హసన్‌ (9) 29 పరుగుల్లోపే ఔటయ్యారు. ఈ క్రమంలో సౌమ్య సర్కార్‌ (17)తో కలిసి లిటన్‌ దాస్‌ (44; 43 బంతుల్లో 4x4) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 60 వద్ద సౌమ్యను హుస్సేన్‌ ఔట్‌ చేశాడు. ముష్ఫికర్‌ (8) కూడా త్వరగానే ఔటవ్వడంతో ఛేదన కష్టమే అనిపించింది. అయితే కెప్టెన్‌ మహ్మదుల్లా (31*: 24 బంతుల్లో 2x4, 1x6) అతడికి తోడుగా నిలిచాడు. వీరిద్దరూ బాగా ఆడటంతో 16 ఓవర్లకు బంగ్లా 110/4తో నిలిచింది. 24 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో 17వ ఓవర్లో బ్రావో 3, 18 ఓవర్లో రాంపాల్‌ 8 పరుగులు ఇవ్వడంతో సమీకరణం ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్లో బ్రావో 9 పరుగులిచ్చినా ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన లిటన్‌ను ఔట్‌ చేశాడు. చివరి 6 బంతుల్లో 13 పరుగులకు బంగ్లా 9 చేయడంతో విండీస్‌ 3 పరుగుల తేడాతో గెలిచింది.


పూరన్‌ మెరిసెన్‌
ప్రపంచకప్‌లో కరీబియన్‌ హిట్టర్ల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారీ వారి నుంచి మెరుపులేమీ లేవు. లెండిల్‌ సిమన్స్‌ బదులు ఎవిన్‌ లూయిస్‌ (6)తో కలిసి క్రిస్‌గేల్‌ (4) ఓపెనింగ్‌ చేశాడు. అయినా మార్పేమీ లేదు. 18 పరుగుల్లోపే వెనుదిరిగారు. హెట్‌మైయిర్‌ (9), ఆండ్రీ రసెల్‌(0), డ్వేన్‌ బ్రావో (0) పూర్‌ ఫామ్‌ కొనసాగించారు. కష్టాల్లో పడ్డ జట్టును రోస్టన్‌ ఛేజ్‌ (39; 46 బంతుల్లో 2x4), నికోలస్‌ పూరన్‌ (40: 22 బంతుల్లో 1x4, 4x6) ఆదుకున్నారు. ఛేజ్‌ వికెట్లను అడ్డుకుంటే.. పూరన్‌ దంచికొట్టాడు. వారు బాగా ఆడటంతోనే స్కోరు వంద దాటింది. వీరిద్దరినీ జట్టు స్కోరు 119 వద్ద షోరిఫుల్‌ ఇస్లామ్‌ ఔట్‌ చేశాడు. ఆఖర్లో కీరన్‌ పొలార్డ్‌ (14), జేసన్‌ హోల్డర్‌ (15; 5 బంతుల్లో) అజేయంగా నిలవడంతో వెస్టిండీస్‌ స్కోరు 142/7కు చేరుకుంది. మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, ఇస్లామ్‌ తలో రెండు వికెట్లు తీశారు.


Also Read: AUS vs SL, Match Highlights: వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్.. శ్రీలంక‌ను చిత్తు చేసిన ఆసీస్


Also Read: Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?


Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీ మాటలు అస్సలు నచ్చలేదు..! కెప్టెన్‌ స్టేట్‌మెంట్‌తో విభేదించిన అజయ్ జడేజా.. ఎందుకు?


Also Read: Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి