తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ప్లీనరీలో ఏపీలోనూ పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు పిలుస్తున్నారని.. గెలిపించుకుంటామని చెబుతున్నామని చేసిన ప్రసంగం తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ సీఎం కేసీఆర్‌కు కౌంటర్‌గా " అలా అయితే రెండు రాష్ట్రాలెందుకు .. కలిపేద్దాం రండి" అని పిలుపునిచ్చారు. అది మొదలు కొంత మంది మళ్లీ సమైక్య రాష్ట్రం చేసే కుట్ర అని.. మరికొందరు సమైక్య రాష్ట్రానికి మద్దతుగా.,.. ఇంకొందరు కలిసే అవకాశమే లేదని ప్రకటనలు చేస్తూ తమ వంతు రాజకీయం తాము చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
కేసీఆర్ ఉమ్మడి రాష్ట్ర సీఎం అవడానికేనంటూ రేవంత్ రెడ్డి విశ్లేషణ !
రెండు రాష్ట్రాలను కలిపేద్దామని మంత్రి పేర్ని నాని నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ వచ్చిన వెంటనే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణను బలిపీఠం ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ తల్లికి బదులు తెలుగు తల్లి ఫోటోలు పెట్టారు. దీన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ జోలికొస్తే సహించబోమని రేవంత్ ప్రకటించారు. నిజానికి రాష్ట్రం కలపడం అనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే తెలంగాణ అనే మాటతోనే ఉద్యమం ప్రారంభించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ మళ్లీ సమైక్య రాష్ట్రం అనే ఆలోచన చేసే అవకాశమే లేదు. కానీ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ వాదంలోని స్వచ్చతపైనే ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా చేసే రాజకీయం ప్రారంభించారని అనుకోవాలి.
సమైక్య రాష్ట్రం చేస్తే కేసీఆర్‌కు మద్దతంటూ కాంగ్రెస్ నుంచే ప్రతిపాదన !
బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను మళ్లీ సమైక్య రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూంటే... అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమైక్య రాష్ట్రం చేస్తే కేసీఆర్‌కు మద్దతిస్తానని ప్రకటించేశారు. కేసీఆర్ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా చేయాలనుకుంటే తన మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి బహిరంగంగా ప్రకటించారు. జగ్గారెడ్డి మొదటి నుంచి సమైక్యవాది. తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉండి.. జై తెలంగాణ అనని నేతలపై దాడులు జరుగుతున్న సమయంలో కూడా తాను సమైక్య వాదినని నేరుగా ప్రకటించుకున్నారు. విడిపోతే సమస్యలు వస్తాయన్నారు. ఆయన ఇప్పటికీ అదే వాదనకు కట్టుబడి ఉన్నారు. ఆ ప్రకారమే కేసీఆర్‌కు సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
రాజకీయ మిత్రులు " జగన్ - కేసీఆర్ " వ్యూహాత్మక అడుగులా ?
ఏపీలో పోటీ అని కేసీఆర్ అంటే.. కలిపేద్దాం అని వైఎస్ఆర్ సీపీ కౌంటర్ ఇచ్చింది. మధ్యలో కాంగ్రెస్ పార్టీ రెండు రకాల వాదనలు తెరపైకి తెచ్చింది. అయితే మొత్తంగా చూస్తే ఇది రాజకీయంగా మంచి మిత్రులు అయిన కేసీఆర్ - జగన్ పొలిటికల్ వ్యూహం అన్న అనుమానం కూడా కొంత మందిలో వ్యక్తమవుతోంది. కేసీఆర్ మాటలతో ప్రారంభమైన సమైక్య రాష్ట్రం అనే చర్చపై ఇప్పుడు తెలంగాణ వాదుల్లో ముఖ్యంగా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కేసీఆర్ మాటలను పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను హైలెట్ చేస్తున్నారు. మళ్లీ రాష్ట్రాల్ని కలిపేకుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యూహాత్మకంగానే "ఇద్దరు మిత్రులు" ఇలా రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపించడానికి ఇదే కారణం. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎప్పుడూ విజయం అందించే ఒకే ఒక్క అంశం ఆంధ్రా వ్యతిరేకత.
గత ఎన్నికల్లో మహా కూటమి ద్వారా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబును ప్రధానంగా విమర్శించి కేసీఆర్ అధికార పీఠం నిలబెట్టుకున్నారన్నది ఎక్కువ మంది చెప్పే మాట. ఈ సారి కూడా ప్రభుత్వంపై ఉన్న యాంటీ ఇన్‌కంబెన్సీని అదే కాన్సెప్ట్‌తో అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ పనిలో భాగంగానే ఇప్పుడు సమైక్య రాష్ట్రం అనే చర్చ ప్రారంభమయిందని భావిస్తున్నారు. దానికి వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి కావాల్సినంత సహకారం లభిస్తోందని భావిస్తున్నారు.
కేసీఆర్ కోరుకున్న ఎఫెక్ట్ వచ్చేసిందా !?
తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. తెలంగాణ, ఏపీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ప్రజలు కూడా తెలంగాణలో ఏం జరుగుతోంది.. ? ఆంధ్రాలో ఏం జరుగుతోందని ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఎవరికి వారు అయిపోయారు. ఒకప్పుడు ఆదిలాబాద్‌లో ఏం జరిగినా చిత్తూరు ప్రజలు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు అది లేదు. మానసికంగానూ ప్రజలు విడిపోయారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం అంతా అభివృద్ధి, సమస్యలు చుట్టూ తిరుగుతోంది. అది తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆ పార్టీపై అసంతృప్తి పెరిగిపోతోందన్న చర్చ కారణంగా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే తమ పార్టీకి శ్రీరామరక్షగా కేసీఆర్ భావిస్తున్నారని.. ఆ ఎఫెక్ట్ కోసమే.. ప్లీనరీలో అలా మాట్లాడారనే అభిప్రాయం ఉంది. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు కేసీఆర్ కోరుకున్న ఎఫెక్ట్ వస్తోందని అంటున్నారు.
Also Read : రాత్రికి రాత్రే తరలిస్తారా? అన్నీ అనుమానాలే! నిరసనలకు బండి సంజయ్ పిలుపు
సమైక్య రాష్ట్రం గురించి చర్చ జరగడమే కేసీఆర్ వ్యూహం ?
కేసీఆర్ ఏపీలో పార్టీ పెడతారో లేదో ఎవరికీ తెలియదు. పెట్టేంత సాహసం చేస్తారని కూడా అనుకోవడం లేదు. కానీ తమ రాష్ట్ర ప్రజలను మెప్పించడానికి.. తమ పాలన పొరుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఆకట్టుకుంటోందని చెప్పడానికి మాత్రమే ఆయన ఈ మాటలను వాడి ఉంటారని భావిస్తన్నారు. అదే సమయంలో మళ్లీ ఇతర పార్టీలు గెలిస్తే సమైక్య రాష్ట్రం వస్తుంది అనే చర్చను కూడా ప్రజల్లో ప్రారంభించాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ వ్యూహం సక్సెస్ అయినట్లుగా తెలంగాణరాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మళ్లీ రాష్ట్రాలను కలిపే చాన్సే లేదు !
ఇప్పుడుజరుగుతున్నదంతా రాజకీయమే. నిజానికి తమను తెలంగాణలో కలపాలని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసినా... మళ్లీ సమైక్య రాష్ట్రం కావాలని తెలంగాణ తీర్మానం చేసినా .. రాష్ట్రాలను కలపడం సాధ్యం కాదు. రెండు పరస్పర అంగీకారంతో కేంద్రం ముందుకు వెళ్లినా మళ్లీ సమైక్య రాష్ట్రం చేయడం 99 శాతం అసాధ్యం. ఏదైనా విడదీసినప్పుడు చాలా సౌలభ్యం ఉంటుంది. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో తేల్చేస్తే సరిపోతుంది. కానీ కలపడం అలా కాదు. పైగా ప్రభుత్వాలు తీర్మానాలు చేసినా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. అలాంటి వాతావరణాన్ని మళ్లీ ఏ ప్రభుత్వమూ కోరుకోదు. అందుకే సమైక్య రాష్ట్రం అనేది రాజకీయ నాయకుల వ్యూహం ప్రకారం తెరపైకి వచ్చిన రాజకీయ అంశమే తప్ప.. ఆ దిశగా ఒక్క శాతం కూడా అడుగుపడే అవకాశం ఉండదు. కానీ రాజకీయం మాత్రం పై స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.