హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ప్రజాభిప్రాయం బీజేపీ వైపే ఉందని, దాంతో టీఆర్ఎస్ పార్టీ తన అధికార బలంతో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా నిన్న అర్ధరాత్రి ఈవీఎంలను తరలించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాత్రికి రాత్రే వీవీప్యాట్ మెషిన్లను తరలించేందుకు యత్నించారని మండిపడ్డారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా కేంద్రాలలో నేడు (అక్టోబరు 31) గాంధీ విగ్రహాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన తెలపాలని పిలుపునిచ్చారు.
వీవీప్యాట్ పనిచేయడం లేదనే సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని కారులో ఎట్లా తరలిస్తారని ప్రశ్నించారు. ‘‘అసలు వీవీప్యాట్ పనిచేయడం లేదనడానికి మీరు ఎవరు? అది పనిచేయడం లేదని మీరెలా నిర్ధారించారు? ఎవరికి చెప్పకుండా ఎలా తరలిస్తారు? నిజంగా పనిచేయకపోతే పోటీ చేసిన అభ్యర్థులకు, ఏజెంట్లకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? దీనిపై మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సిందే’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
పటేల్ విగ్రహానికి నివాళులు
సర్దార్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆయన హైదరాబాద్‌లో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పటేల్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ‘‘1947 స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో సర్దార్ పటేల్ హోంమంత్రిగా కాకుండా ఉండి ఉంటే తెలంగాణ పాకిస్తాన్‌లో కలిసేదేమో! నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్గించడానికి సర్దార్ పటేల్ మార్గదర్శనంలో భారతసైన్యం సాహసోపేతంగా పోలీస్ యాక్షన్ జరిగింది. దీని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. లేకుంటే పాకిస్తాన్‌లో కలిసేదే.
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన జరిగింది.. సర్దార్ పటేల్ యొక్క పోలీసు చర్యల కారణంగానే. ఇదేదో కమ్యూనిస్టుల సాయుధ పోరాటంతోనో... కాంగ్రెస్ సత్యాగ్రహాలతోటో తెలంగాణ విమోచన జరగలేదు. అందుకే తెలంగాణ ప్రజలందరు సర్దార్ పటేల్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ మహనీయుడి సాహసోపేత, కఠిన నిర్ణయాల కారణంగా బ్రిటీష్ కాలంలోని 562 సంస్థానాలు స్వంతంత్ర భారతదేశంలో విలీనం అయ్యాయి. అందుకే ఈ దేశం యొక్క ఏకాత్మతను, సమగ్రతను, అఖండతను కాపాడిన సర్దార్ పటేల్ గారు చిరస్మరణీయులు.
Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది
అయితే తెలంగాణ గడ్డకు విమోచన కల్గించిన సర్దార్ పటేల్ గారి జయంతి కార్యక్రమంలో కేసీఆర్ మాత్రం పాల్గొనడు. ఉద్యమకాలంలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేక పోరాటం గురించి కథలుకథలుగా చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజాంను పొగడడం దురదృష్టకరం. సర్దార్ పటేల్ లేకుంటే కేసీఆర్ చాంద్ పాషా అయ్యేవాడు. కేసీఆర్ దేశభక్తుల విషయంలో వహిస్తున్న నిర్లక్ష్య తీరును బీజేపీ ఖండిస్తోంది. కేసీఆర్ వ్యవహారశైలిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అవసరమొచ్చినప్పుడు సరైన బుద్ధి చెబుతారు.’’ అని బండి సంజయ్ మాట్లాడారు.
Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !