ఏపీలో పార్టీ పెట్టాలని వినతలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో  చర్చ కొనసాగుతోంది. దీనిపై కేబినేట్ భేటీ అనంతరం నిన్న మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందని కేసీఆర్‌కు సలహా ఇచ్చారు.  ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే ఆ తర్వాత  ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. ఏ ఇబ్బంది లేకుండా పోటీ చేయవచ్చని గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణను తిరిగి కలపాలన్న పేర్ని నాని, కేసీఆర్‌ వ్యాఖ్యలపై ట్విటర్లో రేవంత్‌ రెడ్డి స్పందించారు. 


Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !






రేవంత్ ఖబడ్డార్ ట్వీట్


తెలంగాణ జోలికొస్తే ఖబడ్డార్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్, పేర్ని నాని మాట్లాడిన వీడియోలను ఆయన ట్విట్టర్ లో  పోస్టు చేశారు. కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర చేస్తున్నారన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన... కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర అని ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ పై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో మరోసారి స్పందించారు.


Also Read: జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !


తెలంగాణలో రాజకీయ శూన్యత


తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని మంత్రి పేర్ని నాని మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ఓ ఐపీఎస్‌ అధికారి రాజీనామా చేసి మరీ పార్టీ పెట్టారన్నారు. ఇంకొన్ని పార్టీలు కూడా వచ్చాయన్నారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత రాజకీయ శూన్యత ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఈ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.  మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో సీఎం కేసీఆర్‌ మాట తప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. దిండి-పాలమూరు ప్రాజెక్టు నుంచి  తాగునీరు పేరుతో సాగుకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా ఒక్క చెంచాడు నీళ్లు కూడా వినియోగించుకోమని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులపై మాట్లాడిన ఆయన హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఎంత దూరమో విజయవాడ నుంచి హైదరాబాద్‌ కూడా అంతే దూరమని వ్యాఖ్యానించారు. నిత్యం రాజకీయాల్లో ఉండాలనుకునే రేవంత్‌రెడ్డి సంచలనాల కోసం ట్వీట్లు చేస్తారని పేర్ని నాని అన్నారు.


Also Read: అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి