AP Telangana Mlc Election: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం(Election Commission of Inida) షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం పూర్తయ్యింది. ఈ స్థానాలకు నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన చేస్తారు. నవంబర్ 22 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మొత్తం ఈ తొమ్మిది స్థానాలకు నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు.
తొమ్మిది స్థానాలకు ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 29న ఎన్నికలు జరగనున్నాయి. భారత ఎన్నికల సంఘం ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు, తెలంగాణలో జూన్ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏపీలో ఎమ్మెల్సీలుగా చిన గోవిందరెడ్డి, మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు, తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరూద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం పూర్తవ్వడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికల షెడ్యూల్
- ఎన్నికల నోటిఫికేషన్ : నవంబరు 9వ తేదీ
- నామినేషన్ల దాఖలుకు తుది గడువు : నవంబరు 16
- నామినేషన్ల పరిశీలన : నవంబరు 17
- నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ : నవంబరు 22
- పోలింగ్ తేదీ : నవంబరు 29
- ఓట్ల లెక్కింపు : నవంబరు 29
Also Read: గిరిజన తేనెతో శ్రీవారికి అభిషేకం... జీసీసీ ప్రతిపాదనకు టీటీడీ ఓకే