విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. విశాఖలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, హరిప్రసాద్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సభలో పాల్గొన్నారు.  అంతకు ముందు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సభ ఏర్పాటుచేసిన కూర్మన్నపాలెం గేటు వరకు పవన్‌ కల్యాణ్‌ ర్యాలీగా వచ్చారు. ఆయన వెంట జనసైనికులు భారీగా తరలివచ్చారు.



నాయకులు, కవులు... కార్మికుల వైపు నిలబడాలి


విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం సభలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపించారు. నాయకులు, కవులు.. కార్మికులవైపు నిలబడాలన్నారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న ఆయన.. ఉక్కు కర్మాగారాలు లేకపోతే అభివృద్ధి లేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. ఎందరో ప్రాణత్యాగం చేస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందన్నారు. గతంలో జరిగిన ఉక్కు ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం అందరిలో భావోద్వేగం నింపిందని పవన్‌ వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాపిటివ్ మైన్స్ ఉండాలన్నారు. లాభ నష్టాలు లేని పరిశ్రమలు లేవన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. విభజన టైంలో ఎంపీలు గట్టిగా ప్రయత్నిస్తే క్యాపిటివ్ మైన్స్ వచ్చేవన్నారు.


Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ! 


దిల్లీలో మిత్రులు... రాష్ట్రంలో శత్రువులు


వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడడంలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే వైసీపీ నేతలు, కార్మికులు పోరాడుతుంటే ఎందుకు నోరుమెదపడంలేదన్నారు. పార్లమెంట్ కు వెళ్తు్న్న ఎంపీలు కాఫీలు, కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ...బీజేపీతో దిల్లీలో మిత్రులు, రాష్ట్రంలో శత్రువులుగా నటిస్తున్నారని విమర్శించారు. కేంద్రానికి ఇక్కడి కష్టాలు ఎలా తెలుస్తాయని పనన్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు గొంతెత్తి పోరాడితే విషయం ఇంత వరకూ రాదన్నారు. వైఎస్ఆర్సీపీ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులు, కశ్మీర్, సీఏఏ బిల్లులకు మద్దతు ఇచ్చి, రాష్ట్రంలో భారత్ బంద్ అని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  రాజ్యసభ ఛైర్మన్, కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేసిన వైసీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తుందన్నారు. కేంద్రానికి లేఖలు రాస్తు్న్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతుందని, ఎన్నిసార్లు లేఖలు రాస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 


Also Read: పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోండి... జడ్జీలపై అనుచిత పోస్టుల కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు


అఖిలపక్షం ఏర్పాటు చేయండి


అన్ని పార్టీలు, నిర్వాసితులు, కార్మికులందరితో అఖిలపక్షం ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడాలని పవన్ కల్యాణ్ సూచించారు. వారం రోజుల్లో అఖిలపక్షం ఏర్పాటుచేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉక్కు కర్మాగారం రక్షించుకునేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించడం కన్నా ముందు రాష్ట్రంలో ఉమ్మడి పోరాటం రావాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి నడుద్దామన్నారు. కార్మికుల బలిదానాలకు విలువ ఇవ్వాలని కోరారు. 


Also Read: వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి... వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి