మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్ లో కొంతకాలం హిట్స్ లేక ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 'క్రాక్' సినిమా హిట్ మాసివ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా సమయంలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రవితేజకి జోష్ వచ్చింది. వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ
ఇది కాకుండా ఆయన చేతుల్లో 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' అనే మరో రెండు సినిమాలున్నాయి. ఇవి పూర్తికాకుండానే కొత్తగా మరో సినిమా అనౌన్స్ చేశాడు రవితేజ. 'స్వామిరారా' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసిన సుధీర్ వర్మ ఆ తరువాత 'కేశవ', 'రణరంగం' లాంటి సినిమాలు తీశాడు. ఇవి సరిగ్గా ఆడలేదు. దీంతో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. రవితేజ నటించే 70వ సినిమా ఇది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. 'Heroes Don't Exist' అంటూ ఈ కథ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశాడు. దేవాలయాలపై ఉన్న బొమ్మల్ని ఫోకస్ చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇదంతా చూస్తుంటే సుధీర్ వర్మ మళ్లీ క్రైమ్ కామెడీ జోనర్ ను ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ నెల 5న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయబోతున్నారు. మాస్ మహా మేకోవర్ ని చూడబోతున్నామంటూ చిత్రబృందం ఓ హింట్ కూడా ఇచ్చింది. మరి ఆ మేకోవర్ ఎలా ఉంటుందో చూడాలి. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి కథ అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి.