ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రెండో మ్యాచుకు సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ పోరులో గెలిచిన వారికి సెమీస్‌ గ్యారంటీ! ఎందుకంటే మిగతావన్నీ సాధారణ జట్లే. ప్రత్యర్థి కఠినమైన కివీస్‌ కాబట్టి కోహ్లీసేనకు అదృష్టం కలసిరావాలి. దాంతో పాటు కొన్ని తెలివైన వ్యూహాలు పక్కగా అమలు చేయాల్సిందే. అవేంటంటే!


టాస్‌ గెలిస్తే సగం గెలిచినట్టే!
దుబాయ్‌లో ఆడేటప్పుడు టాస్‌ గెలవడం అత్యంత కీలకం. ఇందుకు అదృష్టం కలసిరావాలి. పాకిస్థాన్‌కు ఉపయోగపడిందీ ఇదే! లక్కీగా బాబర్‌ ఎక్కువగా టాస్‌లు గెలిచాడు. న్యూజిలాండ్‌ పోరులో విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిస్తే మ్యాచును దాదాపుగా కైవసం చేసుకున్నట్టే! ఎందుకంటే ఇక్కడ ఛేదన సులభం. మొదట బ్యాటింగ్‌ కష్టం. తొలుత బౌలింగ్‌కు సహకరించే పిచ్‌ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. కానీ కోహ్లీకి టాస్‌ అదృష్టం తక్కువ!  టీ20ల్లో అతడి టాస్‌ విజయాల శాతం 39 మాత్రమే!


180+ చేస్తేనే విజయం
ఒకవేళ టాస్‌ ఓడితే టీమ్‌ఇండియా చేయాల్సింది ఒకే ఒక్కటి. ప్రత్యర్థి ముందు 180+ లక్ష్యాన్ని ఉంచాలి. అంతకు మించి ఎక్కువ చేస్తే ఆనందమే కానీ పది పరుగులు తక్కువ చేసినా దుబాయ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవడం అత్యంత కష్టం. ఇక్కడ అత్యధిక విజయవంతమైన ఛేదన 183. అందుకే టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ కచ్చితంగా రాణించాల్సిందే. రాహుల్‌, రోహిత్‌, కోహ్లీ, సూర్య, పంత్‌, హార్దిక్‌ పరుగుల వరద పారించాలి. మొదట బ్యాటింగ్‌ చేస్తే ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ అత్యంత ప్రమాదకారులుగా మారతారు. ఇన్‌స్వింగింగ్‌ డెలివరీలతో టాప్‌ ఆర్డర్‌ను వణికించగలరు. వారిని తట్టుకొని బ్యాటింగ్‌ చేయాలి.


పవర్‌ ప్లే స్పిన్నర్లదే
ఈ ప్రపంచకప్‌లో దుబాయ్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచులు జరిగాయి. అన్నింటా ఛేదనకు దిగిన జట్లే గెలిచాయి. అత్యధికంగా ఛేదించింది 155. ఇంగ్లాండ్‌.. విండీస్‌ను 55, ఆసీస్‌ను 125కు పరిమితం చేసింది. ఈ రెండింట్లోనూ పవర్‌ప్లేలో ఇంగ్లాండ్‌ స్పిన్నర్లతో వేయించింది. పేస్‌లో మార్పులు చేసే బౌలర్లను ఉపయోగించింది. వారు పవర్‌ప్లేలో 3-4కు తక్కువ కాకుండా వికెట్లు తీశారు. భారత్‌పై పాక్‌, విండీస్‌పై దక్షిణాఫ్రికా ఇలాగే చేశాయి. ఈ రెండు మ్యాచుల్లో వికెట్లు పడ్డాయి. తొలి పది ఓవర్ల వరకు పరుగులు రాలేదు. అంటే మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంటే సగం గెలిచినట్టే. స్వింగ్‌ అయితే భువీ, షమీ.. స్పిన్‌ అయితే వరుణ్‌, జడ్డూ/అశ్విన్‌ రాణించాల్సిందే. ఇక బుమ్రాకు ఏం చేయాలో తెలుసు.


రాహుల్‌, రిషభ్‌ కీలకం
దుబాయ్‌లో ఎక్కువ పరుగులు చేయాలంటే క్రీజులో కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌ ఆఖరి వరకు ఉండాలి! ఇక్కడ వీరిద్దరికీ తిరుగులేని రికార్డులు ఉన్నాయి. రాహుల్‌ ఇక్కడ 12 ఇన్నింగ్సుల్లో 60 సగటు, 143 స్ట్రైక్‌రేట్‌తో 609 పరుగులు చేశాడు. ఎదుర్కొన్నది 423 బంతులే. ఒకసారి 132తో అజేయంగా నిలిచాడు. నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. 51 బౌండరీలు, 26 సిక్సర్లు బాదేశాడు. ఇక రిషభ్ పంత్‌ 13 ఇన్నింగ్సుల్లో 123 స్ట్రైక్‌రేట్‌, 38 సగటుతో 385 పరుగులు చేశాడు. ఇందుకు 311 బంతులు ఎదుర్కొన్నాడు. 2 హాఫ్‌ సెంచరీలు, 32 బౌండరీలు, 12 సిక్సర్లు దంచేశాడు. వీరిద్దరూ దుబాయ్‌ మైదానం బయటకు బంతుల్ని బాదగలరు. స్కోరు పెంచగలరు.


బౌలింగ్‌ భాగస్వామ్యాలు ముఖ్యం
మరో కీలకమైన విషయం బౌలర్ల భాగస్వామ్యాలు. అదేంటి బ్యాటర్ల పార్ట్‌నర్‌షిప్స్‌ ఉంటాయి గానీ బౌలర్లదేముందీ అంటారా? అక్కడే ఉంది అసలు లాజిక్‌. దుబాయ్‌లో ఒక ఎండ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంటే మరో ఎండ్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుంది. ఇంగ్లాండ్‌ దీన్నే ఉపయోగించుకుంది. మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డాన్‌ను ఉపయోగించి విండీస్‌ను దెబ్బకొట్టింది. ఆసీస్‌ మ్యాచులో రషీద్, క్రిస్‌వోక్స్‌, తైమల్‌ మిల్స్‌ను ప్రయోగించింది. సఫారీలు కేశవ్‌ మహరాజ్‌, నార్జ్‌, ప్రిటోరియస్‌ను ఉపయోగించింది. అందుకే టీమ్‌ఇండియా వరుణ్‌+భువీ,  వరుణ్‌+బుమ్రా, వరుణ్‌+షమి, జడ్డూ+వరుణ్‌ ఇలా కాంబినేషన్లను ఉపయోగించాలి. ముఖ్యంగా ఆరో బౌలర్‌గా హార్దిక్‌ పాండ్య రాణించాలి. ఒకవేళ అతడు వేయకపోతే అతడు లేదా భువీ స్థానంలో శార్దూల్‌ను ఆడిస్తే మెరుగు.


Also Read: SL vs SA, Innings Highlight: లంకేయుల విజయం 'కిల్‌' చేసిన మిల్లర్‌! ఆఖరి ఓవర్లో వరుస సిక్సర్లు


Also Read: Hasaranga Hattrick in T20 WC: సూపర్ 12 మ్యాచ్‌ల్లో మొదటి హ్యాట్రిక్.. అద్భుతం చేసిన సింహళ స్పిన్నర్!


Also Read: ENG vs AUS, Match Highlights: జోస్ బట్లర్ షో.. ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ విజయం!


Also Read: ICC T20 WC 2021, IND vs NZ Preview: సెమీస్ అవకాశాలు ఉండాలంటే.. 18 ఏళ్ల రికార్డు బద్దలవ్వాల్సిందే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి