ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దుబాయ్‌లో మ్యాచులు సినిమాలను తలపిస్తున్నాయి. ఒకే తెర.. ఒకే కథ.. ఒకే క్లైమాక్స్‌.. దర్శకులు, పాత్రధారులే మారుతున్నారు. దుబాయ్‌ను వెండితెరగా భావిస్తే మ్యాచుల్ని సినిమాలుగా చూసుకుంటే క్రికెటర్లను పాత్రధారులుగా భావిస్తే 'ఫస్టాప్‌ ఫట్టు.. సెకండాఫ్‌ హిట్టు' అనిపిస్తోంది. అంతిమంగా టాస్‌ అసలు సిసలు హీరో అవుతోంది!


ఇదే కథ
దుబాయ్‌లో ఇప్పటికి ఏడు మ్యాచులు జరిగాయి. అన్నింట్లోనూ టాసే హీరో! ఈ ఏడు మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు విలవిల్లాడాయి. పవర్‌ప్లేలోనే టాప్‌ ఆర్డర్ల వికెట్లు చేజార్చుకొని బిత్తరపోయాయి. ప్రపంచంలోనే టాప్‌క్లాస్‌ బ్యాటర్లను బౌలర్లు ఉక్కరిబిక్కిరి చేశారు. అస్సలు పరుగులు చేయనివ్వలేదు. స్పిన్నర్లైతే చుక్కలు చూపించారు. పేసర్లతే ఇన్‌స్వింగర్లు, ఔట్‌ స్వింగర్లతో బోల్తా కొట్టించారు. మొదటి జట్టు తక్కువ స్కోరే చేయడం, మంచు కురిసి బంతిపై పట్టుచిక్కకపోవడంతో సెకండాఫ్‌లో ఛేజింగ్‌ టీమ్‌ సునాయాసంగా విజయాలు సాధించేస్తోంది. ఇదే కథా అన్ని మ్యాచుల్లోనూ రిపీటైంది. ఇవిగో ఆ సినిమాలు మరోసారి రివైండ్‌ చేసుకోండి!!


సినిమా 1- ఇంగ్లాండ్‌ vs వెస్టిండీస్‌
అప్పటి వరకు టీ20 ప్రపంచకప్పుల్లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌ ఒక్క విజయమైనా అందుకోలేదు. ఇక విండీస్‌ డిఫెండింగ్‌ ఛాంప్‌గా అడుగు పెట్టింది. జట్టునిండా హిట్టర్లే. కానీ టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌ చేసింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేసింది. అదే పతనం కొనసాగిస్తూ 14.2 ఓవర్లకు 55కే ఆలౌటైంది. తక్కువ స్కోరును ఆంగ్లేయులు 4 వికెట్ల నష్టానికి 8.2 ఓవర్లకే ఛేదించేశారు.


సినిమా 2- భారత్ vs పాకిస్థాన్‌
చిరకాల శత్రువు పాకిస్థాన్‌కు టీమ్‌ఇండియాపై అప్పటికే చెత్త రికార్డు. ఐదుసార్లు ఓడిపోయింది. కోహ్లీసేనేమో విజయగర్వంతో బరిలోకి దిగింది. కానీ టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగింది. పవర్‌ప్లేలో 3 వికెట్లు నష్టపోయి 36 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు పడ్డా విరాట్‌ కోహ్లీ (57), రిషభ్ పంత్‌ (39) రాణించడంతో 151 పరుగులు చేసింది. సెకండాఫ్‌లో మంచు కురవడం, బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్లు పడకపోవడంతో పాకిస్థాన్‌ సూపర్‌హిట్టైంది. 10 వికెట్ల తేడాతో గెలిచేసింది.


సినిమా 3- ఆసీస్‌ vs ఇంగ్లాండ్‌
ఈ చిరకాల ప్రత్యర్థుల సినిమాపైనా అభిమానులు గంపెడాశాలు పెట్టుకున్నారు! కానీ పాత్రధారులే మారారు తప్ప సినిమా కాదు. ఆసీస్ టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసింది. పవర్‌ప్లేలో 3 వికెట్లు నష్టపోయి 21 పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగించింది. బౌలర్లు ధాటిగా బంతులు వేయడంతో 125కి ఆలౌటైంది.  ఇంగ్లాండ్ భీకరమైన ఛేదనతో ఆకట్టుకుంది. జోస్‌ బట్లర్‌ (71) వీరి విహారంతో సెకండాఫ్‌ సూపర్‌హిట్టైంది. జస్ట్‌ 11.4 ఓవర్లకే ఇంగ్లాండ్‌ 2 వికెట్ల నష్టంతో గెలిచేసింది.


సినిమా 4- భారత్‌ vs న్యూజిలాండ్‌
ఇవి రెండూ మిత్రదేశాలే అయినా ఐసీసీ టోర్నీల్లో శత్రుదేశాలే! ఇక్కడా హీరో టాస్‌ మనల్ని వెక్కిరించేశాడు! ప్రత్యర్థివైపు వెళ్లిపోయాడు. వారం రోజులు ప్రాక్టీస్‌ చేసిన కోహ్లీసేన పవర్‌ప్లేలో 2 వికెట్లు నష్టపోయి 35 పరుగులే చేసింది. సగటున పది పరుగులకు ఒక వికెట్‌ చొప్పున నష్టపోయి 20 ఓవర్లకు 110/7కు పరిమితమై ఫస్టా్‌ఫ్‌ ఫట్‌ అనేసింది. డరైల్‌ మిచెల్‌ (49), కేన్‌ విలియమ్సన్‌ (33) 14.3 ఓవర్లకే సెకండాఫ్‌ను సూపర్‌హిట్టు చేసేశారు.


మిగిలిన మూడు సినిమాలు
శ్రీలంక vs  ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ vs దక్షిణాఫ్రికా, అఫ్గాన్‌ vs పాకిస్థాన్‌ సినిమాల్లోనూ ఇలాగే జరిగింది. అఫ్గాన్‌ మినహా మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు టాస్‌ ఓడిపోయాయి. పవర్‌ప్లేలో దారుణంగానే ఆడాయి. 150 కన్నా తక్కువ స్కోర్లే చేశాయి. అఫ్గాన్‌ టాస్‌ గెలిచినా మొదట బ్యాటింగ్‌ చేసింది. తక్కువ స్కోరు చేసినా పాక్‌ను ఆఖరి వరకు ఆడించొచ్చు అనుకుంది. అలాగే చేసి రన్‌రేట్‌ కాపాడుకుంది. ఈ మూడింట్లోనూ ఛేదన జట్లు ఆసీస్‌, దక్షిణాఫ్రికా, పాక్‌ గెలిచాయి. మరి దుబాయ్‌.. కీలకమైన ఫైనల్లో ఎవరిని వెక్కిరిస్తుందో చూడాలి!!


Also Read: India, T20 WC Standings: పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే.. ఇంకా అవకాశం ఉంది!


Also Read: IND vs NZ, T20 World Cup: వరల్డ్‌క్లాస్ టీం.. వరస్ట్ పెర్ఫార్మెన్స్.. ఎనిమిది వికెట్లతో టీమిండియా చిత్తు