ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్ వైపు దూసుకుపోతోంది! వరుసగా మూడో విజయం అందుకొంది. ఆరు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించింది. రసివాన్ డర్ డుసెన్ (22) ఫర్వాలేదనిపించాడు. తెంబా బవుమా (31) అజేయంగా నిలిచాడు. డికాక్ (16), రెజా హెండ్రిక్స్ (4), అయిడెన్ మార్‌క్రమ్ (0) త్వరగా ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, మెహదీ హసన్, నసుమ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను సఫారీ పేసర్లు వణికించారు. ప్రతి బంతికీ పరీక్ష పెట్టారు. పిచ్, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆన్రిచ్ నార్జ్ (3/8), కాగిసో రబాడా (3/20), తబ్రైజ్ శంషీ (2/21) బంగ్లా పులులను విలవిల్లాడించారు. పవర్‌ప్లేలో 3 వికెట్లు తీసి 28 పరుగులే ఇచ్చారు. జట్టు స్కోరు 22 వద్ద వరుస బంతుల్లో ఓపెనర్ మహ్మద్ నయీమ్ (9), వన్‌డౌన్ ఆటగాడు సౌమ్య సర్కార్ (0)ను రబాడా ఔట్ చేశాడు. మరో రెండు పరుగులకే ముష్ఫికర్ రహీమ్ (0)నూ అతడే పెవిలియన్ పంపించాడు. దీంతో బంగ్లా కుదేలైంది. జట్టు స్కోరు 34 వద్ద మహ్మదుల్లా (3)ను నార్జ్, లిటన్ దాస్ (24)ను శంషీ ఔట్ చేశాడు. అక్కడి నుంచి బంగ్లా ఆలౌటయ్యేందుకు మరెంతో సమయం పట్టలేదు. 18.2 ఓవర్లకే బంగ్లా ఆలౌటైంది. మెహదీ హసన్ (27) ఆఖర్లో కాస్త బ్యాటు ఝుళిపించాడు!
దక్షిణాఫ్రికా గెలుపుతో గ్రూప్ 1 పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారిపోయింది. వరుసగా మూడో విజయం అందుకున్న సఫారీ జట్టు 6 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఆఖరి మ్యాచులో టేబుల్ టాపర్ ఇంగ్లాండ్‌ను కనక ఓడిస్తే తెంబా బవుమా సేనకు తిరుగుండదు. దక్షిణాఫ్రికాకు ఉన్న ఒకే ఒక్క అడ్డు ఆస్ట్రేలియా మాత్రమే. ఆ జట్టు రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. తర్వాత వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. వీరిలో ఓ ఒక్కరు ఓడించినా పరిస్థితి అటుఇటయ్యే అవకాశం లేకపోలేదు.
Also Read: Eng Vs SL , Match Highlights: లంకపై పేలిన బట్లర్ బాంబ్.. 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం
Also Read: T20 Worldcup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?