కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై పూటకో మాట మాట్లాడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ప్రజలకు ఆహార భద్రత బాధ్యతను రాజ్యాంగం కేంద్రానికి అప్పగిస్తే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి కేంద్రం పరిధిలోని అంశాలని గుర్తుచేశారు. యాసంగిలో వరి వద్దనడంతో అంతర్యాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై మాట్లాడారు.



ఉత్తరాధి రైతు ఆందోళనకు మద్దతు


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామని బండి సంజయ్‌ అవాకులు చవాకులు పేలుతున్నారని, కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము బీజేపీకి ఉందా అని సవాల్ చేశారు. కేసీఆర్‌ని టచ్‌ చేసి బతికి బట్టకడతారా అన్నారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రేపట్నుంచి టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్నారు. ఉత్తర భారత రైతులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. సాగు చట్టాలను రద్దు చేసే వరకు రైతులకు అండగా పోరాడతామన్నారు. దిల్లీ బీజేపీ వరి వేయొద్దని చెప్తూ... తెలంగాణలో సిల్లీ బీజేపీ వరి వేయాలని నాటకాలు ఆడుతుందన్నారు. వరి కొంటామని కేంద్రం నుంచి బీజేపీ నేతలు లేఖ తేవాలని సవాల్ చేశారు. వానాకాలం ధాన్యం కొనే వరకు బీజేపీని నిద్రపోనివ్వనని కేసీఆర్ అన్నారు. 



పెట్రో ధరలు పెంచేది, తగ్గించేది లేదు


పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం అబద్ధాలు చెబుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. 2014లో క్రూడాయిల్‌ ధర 105 డాలర్లు ఉంటే ఇప్పుడు 83 డాలర్లు ఉందన్నారు. బ్యారెల్‌ ధర 30 డాలర్లు ఉన్నప్పుడు కూడా కేంద్రం భారీగా సుంకాలు వేసిందన్నారు. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్‌ పెంచిందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తగిలిన దెబ్బలతో ఇంధన ధరలను పిసరంత తగ్గించారన్నారు. బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదన్న సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే ఊరుకోమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రంలో వ్యాట్‌ ఒక్క రూపాయి కూడా పెంచేది, తగ్గించేది లేదన్నారు. క్రూడాయిల్ పై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 


Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?



యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయండి


యాసంగిలో వరి వేయకుండా ఇతర పంటలు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని స్పష్టంగా చెప్పిందన్నారు. కరోనా విపత్తు కాలంలో నెలల తరబడి రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. 


Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?


బండి సంజయ్... కేంద్రం మెడలు వంచి కొనుగోలు చేయిస్తారా.?


యాసంగి ధాన్యానికి నాణ్యత తక్కువగా ఉండడం వల్ల తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. యాసంగిలో రా రైస్‌ మాత్రమే కొంటామని, బాయిల్డ్‌ రైస్‌ కొనలేమని చెప్పిందన్నారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ఇవ్వాలని ఎఫ్‌సీఐ కోరిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెడుతోందన్నారు. బండి సంజయ్‌ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, రైతులు వరి పంటనే వేయాలని ప్రభుత్వం మెడలు వంచి వరి పంట కొనుగోలు చేయిస్తామని చెబుతున్నారన్నారు. ఎవరి మెడలు వంచి కొనుగోలు చేయిస్తారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి కొనుగోలు చేయిస్తారా అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని కండీషన్‌ పెడుతుంటే ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్‌కు నెత్తి లేదు కత్తి లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 


Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం


హుజూరాబాద్ ఉపఎన్నికపై


రాజకీయ పార్టీకి గెలుపు ఓటములు సహజమని సీఎం కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలప్పుడు గెలిచామని, హుజురాబాద్ లో ఓడిపోయామన్నారు. దానికే ప్రజలు తిరస్కరించారని అంటే మొన్నటి ఉప ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని దానర్ధం బీజేపీని ప్రజలు తిరస్కరించినట్టేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దళితబంధు పథకం టీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని, ఆ పథకాన్ని వందకు వంద శాతం అమలుచేసి తీరుతామన్నారు. దళితులు, గిరిజనుల కోసం తెచ్చిన చట్టాలను లొట్టపీసు చట్టాలని బీజేపీ నేతలు అంటున్నారని, ఎన్నికలచ్చినప్పుడల్లా బీజేపీ నాయకులు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు పది పైసల పని కూడా చేయలేదని ఆరోపించారు. 


Also Read: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం... ఎంతెంత పెరిగాయంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి