నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు టైమ్ దగ్గర పడే కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గొడవలు ముదురుతున్నాయి. ఏకంగా 8 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. అందులో 7, 8, 12, 20, 24, 37, 38, 40 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులే నేరుగా వైసీపీ నేతల వద్దకు వెళ్లి ఆ పార్టీ కండువా కప్పుకోవడం విశేషం.
ఏకగ్రీవాలతో టీడీపీకి షాక్..
ఏకంగా టీడీపీ అభ్యర్థులే నేరుగా వైరి వర్గంతో చేతులు కలపడంతో పార్టీకి పెద్ద షాక్ తగిలింది. దీంతో తమ అభ్యర్థుల్ని బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారంటూ టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. ఏకగ్రీవాల విషయంలో అధికారులు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప సహా.. స్థానిక నేతలు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు
మా అభ్యర్థుల్ని భయపెట్టారు..
అటు జనసేన కూడా అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ అభ్యర్థుల్ని వైసీపీ నేతలు బెదిరించి వారివైపు తిప్పుకున్నారని అన్నారు జనసేన నేతలు. వైసీపీ ఆగడాలపై తాము పోరాటం చేస్తామని, చివరి వరకూ నిలబడతామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.
నెల్లూరులో సగం పని పూర్తి..
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇప్పటికే సగం పని పూర్తి చేసింది. 8 డివిజన్లు ఏకగ్రీవం కాగా.. దాదాపు మరో 40 డివిజన్లలో నామమాత్రపు పోటీ ఉండేట్లు జాగ్రత్త పడింది. కీలక అభ్యర్థులను తెలివిగా పక్కకు తప్పించింది. టీడీపీ, జనసేన తరపున డమ్మీ అభ్యర్థులే చాలా ప్రాంతాల్లో బరిలో ఉండేట్టు వ్యూహ రచన చేసింది. నామినేషన్ల పరిశీలనలోనే కీలక అభ్యర్థులు తొలగిపోవడంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకలా మారింది.
Also Read: ఈ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో స్థిరంగా.. నేటి ధరలు ఇవీ..
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారులు వైసీపీకి వంత పాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చదువులేని సన్నాసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిగ్గూ ఎగ్గు లేకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గంటలు గడుస్తున్నా కూడా ఫైనల్ లిస్ట్ ఇవ్వడంలేదని మండిపడ్డారాయన. మంత్రి చిల్లర పనులు చేస్తున్నారని, ఆయనకి దమ్ముంటే సక్రమంగా పోటీలో నిలవాలని డిమాండ్ చేశారు.
సోమిరెడ్డి విమర్శలు
ప్రభుత్వం బరితెగించిందని, అధికారులు కూడా బరితెగించారని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరులో తమ హయాంలో 4వేల కోట్లతో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధి ఇప్పుడు ఆగిపోయిందని, దాని ఫలితం కార్పొరేషన్ ఎన్నికల్లో బయటపడుతుందని భయపడి ఏకగ్రీవాలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటూ అధికారులు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
Also Read: స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. నేడు ధరలు ఇలా..
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..