బ్లడ్ మనీ: ప్రాణం విలువను నిర్దేశించే వింత సంప్రదాయం.. క్షమాభిక్షకు ఇదే మార్గమా?
బ్లడ్ మనీ అంటే రక్తాపరాధం లేదా నేరం చేసినందుకు చెల్లించే నష్టపరిహారంగా చెప్పవచ్చు. దీన్ని అరబిక్‌లో దియా (Diyya) గా పిలుస్తారు.

Bloody Money: ప్రతి నేరానికి ఒక శిక్ష ఉంటుంది. ఈ శిక్ష తీవ్రత నేరాన్ని బట్టి, నేరస్థులను బట్టి మారుతుంది. కొన్ని దేశాల్లో నేరాలు - వాటి శిక్షలు భిన్నంగా ఉంటాయి. ఆ దేశాల చట్టాలను బట్టి శిక్షలను అమలు చేస్తారు. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో నేరస్థులకు విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు యెమెన్ దేశంలో మరణ శిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో బ్లడ్ మనీ అనే అంశం సర్వత్రా చర్చనీయమైంది. ఈ మరణ శిక్షకు క్షమాభిక్ష కావాలంటే బాధితుడి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ సంప్రదాయం ఏంటి? అసలు ఎలా అమల్లోకి వచ్చింది? ఈ బ్లడ్ మనీని ఎవరు నిర్ణయిస్తారు? అన్న అంశాలను ఈ కథనం చదివితే పూర్తిగా అర్థం అవుతుంది.
బ్లడ్ మనీ అంటే ఏమిటి?
బ్లడ్ మనీ అంటే రక్తాపరాధం లేదా నేరం చేసినందుకు చెల్లించే నష్టపరిహారంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తిని చంపినా, తీవ్రంగా గాయపరిచినా ఆ బాధితుడి కుటుంబానికి పరిహారంగా నిర్ణయించిన మేరకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అరబిక్‌లో దియా (Diyya) గా పిలుస్తారు. ఇస్లామిక్ షరియా చట్టాలలో ఇది ఒక కీలక అంశంగా చెప్పాలి. నేరస్థుడు మరణ శిక్ష నుంచి ఈ బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా విడుదల పొందే అవకాశం ఉంది. లేదా మరణ శిక్షను తగ్గించి మరో శిక్ష వేసే అవకాశం కలుగుతుంది. ఈ బ్లడ్ మనీ అనేది తమ ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి పరిహారం చెల్లించడం లాంటిది. మరోవైపు, బాధిత కుటుంబం ప్రతీకార మరణం కోరుకోకుండా నేరస్థుడిని క్షమించే అవకాశంగానూ బ్లడ్ మనీ ఉపయోగపడుతుంది.
మధ్య ప్రాచ్యంలో ఇస్లాంకు పూర్వమే బ్లడ్ మనీ ఆచారం
ఇస్లాం మతానికి పూర్వమే ఇలాంటి ఆచారమే యూదుల గ్రంథమైన తోరాహాలో ఉంది. కానీ, వారి గ్రంథంలో ప్రాణానికి పరిహారం చెల్లించే అవకాశం లేదు. దీన్ని వారి మత గ్రంథం అంగీకరించదు. కానీ, ఉద్దేశపూర్వకంగా కాక, పొరపాటున లేదా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి చేతిలో ఎవరైనా మరణిస్తే అతను యూదుల మత పెద్దలు ఏర్పాటు చేసిన ఆశ్రయ పురంకు పారిపోయి అక్కడ నివసించాలి. యూదుల ప్రధాన యాజకుడు (High Priest) మరణించే వరకు ఈ ఆశ్రయ పురంలో అతను జీవించాలి. ఇది ప్రతీకారం తీర్చుకోకుండా, పొరపాటును క్షమించే ఆచారంగా చెబుతారు. అయితే, ఉద్దేశపూర్వకంగా చంపితే మాత్రం చంపిన వ్యక్తి మరణ శిక్షకు గురికావాల్సిందే. వీరి మత గ్రంథాలలో "కఫర్" (Kopher) అనే ఆచార సంప్రదాయం ఉంది. దీన్నే "విమోచన ధర" (ransom) లేదా "నష్టపరిహారం" అని కూడా అంటారు. ఉదాహరణకు, ఒక ఎద్దు ప్రమాదవశాత్తు ఒక వ్యక్తిని పొడిచి చంపితే ఆ ఎద్దు యజమాని కఫర్‌ను బాధిత కుటుంబానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇది బ్లడ్ మనీగా పరిగణించరు. అనుకోకుండా జరిగిన ప్రమాదం జరిగినందుకు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించడంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా చంపితే మాత్రం నేరస్థుడికి మరణ శిక్ష తప్పదు.
అరేబియా ద్వీపకల్పంలో సంప్రదాయం పుట్టుక
ఇస్లాం పుట్టుకకు ముందే అరేబియా ద్వీపకల్పంలో బ్లడ్ మనీ చెల్లింపు అనేది ఒక సంప్రదాయంగా మారింది. ఆ ప్రాంతంలో నాడు తెగల మధ్య ఘర్షణలు ఉండేవి. ఒక తెగ వ్యక్తి మరో తెగ వ్యక్తిని చంపితే మరుక్షణమే ప్రతీకార చర్యగా చంపిన తెగ వారిని చంపేవారు. "రక్తానికి రక్తం" పరిహారంగా చెప్పుకునేవారు. ఇలా జరగడాన్ని ఆపేందుకు ఆ తెగల పెద్దలు హత్యకు గురైన వ్యక్తికి చంపిన వ్యక్తి నుండి ఆర్థిక పరిహారం ఇప్పించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఆ తెగల మధ్య ఘర్షణలు, చంపుకోవడాలు తగ్గాయి. ఇస్లాం ఆవిర్భావం తర్వాత ప్రవక్త మహమ్మద్ ఈ సంప్రదాయాన్ని చట్ట రూపంలో అమలు చేశారు. ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్, సున్నత్లలో దియా అనే ఈ ఆచారం కోసం ప్రస్తావించడం జరిగింది. వీటి ఆధారంగా ఏర్పడిన ఇస్లామిక్ చట్టమైన షరియా కొన్ని నిబంధనలను రూపొందించింది.
ఇస్లామిక్ షరియా చట్టంలో ఖిసాస్, దియాలు
ప్రవక్త మహమ్మద్ ఈ సంప్రదాయాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా షరియా చట్టంలో రెండు ప్రధాన నిబంధనలు చేర్చారు. వీటిని ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ దేశాల్లో అమలు చేస్తున్నారు:
1. (ఖిసాస్ Qisas): ఇది 'కంటికి కన్ను - పంటికి పన్ను' అనే సూత్రంతో రూపొందించిన నిబంధన. అంటే, బాధిత కుటుంబం కోరుకుంటే హత్యకు కారణమైన నేరస్థుడికి మరణ శిక్ష విధిస్తారు.
2. దియా (Diyya): ఇది ఆర్థిక పరిహారానికి సంబంధించింది. బాధితుడి కుటుంబం 'ఖిసాస్'కు బదులుగా 'దియా'ను అంటే నష్ట పరిహారాన్ని అంగీకరిస్తే మరణానికి కారణమైన నేరస్థుడి చేత నష్ట పరిహారం చెల్లించేలా చేస్తారు. అతనికి మరణ శిక్ష తప్పుతుంది. అయితే, దీనికి ప్రధాన నిబంధన ఏంటంటే, బాధిత కుటుంబం దియాకు అంగీకరిస్తేనే మరణ శిక్ష తప్పుతుంది.
దియా సంప్రదాయం అమలులో ఉన్న దేశాలు
అరేబియా ద్వీపకల్పంలోని దేశాల్లో ఈ దియా సంప్రదాయం అమలులో ఉంది. ప్రధానంగా ఇస్లామిక్ షరియా చట్టం అమలు చేసే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఇరాన్, పాకిస్థాన్ (పరిమిత స్థాయిలో), కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అమలు చేస్తున్నారు. ఇక యెమెన్ దేశంలో నిమిష ప్రియ కేసులో ఈ దేశ చట్టమే వర్తిస్తుంది. ఈ దేశాల్లో హత్యలకు, తీవ్రమైన నేరాలకు మరణ శిక్ష అమలులో ఉంది. అయితే, బ్లడ్ మనీ చెల్లింపు అనేదాన్ని బాధిత కుటుంబం అంగీకరిస్తే ప్రత్యామ్నాయంగా దియాను అంటే బ్లడ్ మనీ చెల్లింపును అమలు చేస్తున్నారు.
బ్లడ్ మనీ ఎంత? ఎవరు నిర్ణయిస్తారు?
దియాలో భాగమైన బ్లడ్ మనీ ఎంత చెల్లించాలన్నది ఆ దేశంలో ఏర్పాటైన చట్టాలకు అనుగుణంగా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, కొన్ని కేసుల్లో బాధితుడి కుటుంబం కూడా నిర్ణయించే అవకాశం ఉంది. పూర్వకాలంలో ఈ దియా విలువ 100 ఒంటెలుగా ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత ఇది బంగారం రూపంలో, వెండి, కరెన్సీ రూపంలోకి మారింది. అయితే, పరిహారం, చట్టంలోని నిబంధనలు అన్ని దేశాల్లో ఒకేలా ఉండవు. ఆయా దేశాలు షరియా సూత్రాల ఆధారంగా స్వంతంగా చట్టాలను రూపొందించుకొని అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం బ్లడ్ మనీ ఎంత చెల్లించాలన్నది నిర్ణయించడం జరుగుతుంది. అయితే, ఈ బ్లడ్ మనీ విలువ బాధితులను బట్టి మారుతుంది. ఉదాహరణకు, స్త్రీ చనిపోతే చెల్లించే బ్లడ్ మనీ పురుషుడికి పరిహారంగా నిర్ణయించిన దాంట్లో సగంగా ఉంటుంది. ముస్లిమేతరులు చనిపోతే వారి విలువ వేరేగా ఉంటుంది. వయస్సును బట్టి, లింగ భేదం బట్టి బాధితుడికి పరిహారం మారుతుంది. నేరం తీవ్రత, నేరస్థుడి వయస్సు, లింగ భేదం, నేరస్థుడి ఉద్దేశాలు, బాధిత కుటుంబం పరిస్థితులను బట్టి బ్లడ్ మనీ మారుతుంది.






















