Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల వర్షాలు.. ఏపీలో ఐదు రోజుల వరకు..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపాయి.
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గురు, శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఐదు రోజులు, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా వెళ్లిపోయిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంగా ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి/ పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు తేలికపటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇవాళ (సెప్టెంబర్ 16) ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక శనివారం (సెప్టెంబర్ 18) నాడు ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో కూడా వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంగా కారణంగా తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాల్ పల్లి, కొమురంభీమ్, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు రోజుల నుంచి కొంత తగ్గినట్లు కనిపించినా రోజులో ఏదో ఒక సమయంలో జల్లులు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వేడిగా ఉండి.. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పలు చోట్ల సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Hyderabad Girl Rape: బాలిక హత్యాచార కేసులో అతను దొరికేశాడు, త్వరలో నిందితుడు కూడా..! రంగంలోకి డీజీపీ