Top 10 Headlines Today:
1. తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం మళ్లీ సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ ప్రసాదం పై సీఎం చంద్రబాబు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గత ప్రభుత్వం అన్నీ అపవిత్రం చేసిందని మండిపడ్డారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం కరెక్టు కాదన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడడం నిజమే
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని.. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే అని చంద్రబాబు అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని చాలా మంది మథనపడ్డారని సీఎం తెలిపారు. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించామని.. చాలా వరకు పరిస్థితులు మెరుగు పడ్డాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. వైవీ సుబ్బారెడ్డికి లోకేశ్ సవాల్
తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడిన మాట నిజమే అని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. తిరుమలను అపవిత్రం చేసిన వారిని వదలబోమని మంత్రి తేల్చి చెప్పారు. తాను తిరుపతిలోనే ఉన్నానని.. అవసరమైతే ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని టీటీడీ మాజీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డికి సవాలు విసిరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ
ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బాలినేని వైసీపీకి షాక్ ఇవ్వగా.. తాను కూడా రాజీనామా చేస్తున్నట్లు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రకటించారు. తనతో పాటు కలిసి ప్రయాణం చేసిన వారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులు
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు ప్రకటించారు. దీనికి సంబందించిన విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు జారీ చేస్తామని సీఎం తెలిపారు. ముందు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని స్క్రూట్నీ చేస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. నేడే తెలంగాణ కేబినేట్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. ఇక పిల్లలకు పండగే
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రాంరభం కానున్నాయి. కాగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో హాస్టల్స్, వేరే ప్రాంతాల్లో ఉండి చదువుకునే విద్యార్థులు ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. హోంమంత్రితో బాలీవుడ్ నటి భేటీ
తనపై అక్రమ కేసులు, వేధింపులపై విచారణ జరిపి.. కేసును విత్ డ్రా చేసుకోవాలని ముంబై నటి కాదంబరీ జత్వానీ కుటుంబం హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు. నటి జత్వానీ, ఆమె తల్లిదండ్రులు హోంమంత్రితో అరగంట పాటు భేటీ అయ్యారు. కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. పాక్ వద్ద కూడా అణ్వస్త్రాలు ఉన్నాయన్న ట్రంప్
అణ్వస్త్రాలతో ఈ ప్రపంచానికి అతి పెద్ద ముప్పు పొంచి ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆఖరికి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్‌ను అందిపుచ్చుకుందంటూ దాయాది దేశంపై ట్రంప్ చులకన భావంతో మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మానవాళికి పెను విపత్తును తెచ్చి పెట్టే ఈ అణ్వస్త్రాలపై తానే స్వయంగా నిఘా ఉంచే వాడినని.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. భారీ స్కోరు దిశగా భారత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాను అశ్విన్-రవీంద్ర జడేజా ఆదుకున్నారు. వీరిద్దరూ టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపించారు. అశ్విన్ సెంచరీతో చెలరేగగా.. జడేజా 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ అభేద్యమైన ఏడో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. దీంతో భారత జట్టు తొలి రోజును ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులతో సంతృప్తికరంగా ముగించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..