Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే  పంట నష్టం సాయం, కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

  


కేంద్ర సాయంపై తీర్మానం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వరద తాకిడికి ప్రజలు భారీగా నష్టపోయారు. రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని పరిశీలించింది.  దీనిపై కేంద్రం నుంచి ఉదారంగా సాయం చేయాలని క్యాబినెట్ తీర్మానం చేయనుంది. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పెంచేందుకు ప్రస్తుత విద్యార్హతలను సవరించే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో ఇబ్బంది లేకుండా సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల జారీకి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కుల గణనను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కుల గణన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుల గణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించనుంది.


రుణమాఫీ పై చర్చ
తెలంగాణలో రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే రూ.2 లక్షలకు పైగా రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో దశలవారీగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. రైతుబంధు బదులు పంట పెట్టుబడుల కోసం రైతు భరోసాను ప్రవేశపెడతారు. అమలు, పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయాల సేకరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం వానాకాలం పంటలు చివరి దశలో ఉన్నందున ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు పంటలు వేసిన వారికే సాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.



హైడ్రాకు చట్టబద్ధత
చెరువులు, నాలాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు 99 జీవో ద్వారా కొనసాగుతోంది. ఈ సంస్థ ఎఫ్​‌టీఎల్‌​లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకుని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ అంశంపై కేబినెట్ రేపు నిర్ణయం తీసుకోనుంది.


 కమీషన్లకు చట్టబద్ధత 
 అలాగే విద్య, వ్యవసాయ కమీషన్లకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌గా కోదండరెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, కోఠిలోని ఉస్మానియా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేర్లను కేబినెట్ ఖరారు చేయనుంది. వీటితో పాటు ఆరోగ్య బీమా, రేషన్ కార్డులు, గ్రామపంచాయతీల్లో పేదలందరికీ ఆరోగ్య బీమా కల్పించే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సీఎంఆర్ఎఫ్ నిధుల భారీ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేబినెట్ భేటీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. హామీల అమలుపై చర్చ జరగనుంది. వర్షాకాలం ముగుస్తున్న దృష్ట్యా రైతు భరోసా పథకం అమలుపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్పష్టత రానుంది.