పది రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతాలైన లాలాచెరువు, దివాన్‌చెరువు ప్రాంతాల్లో చిరుతపులి భయంతో ప్రజలు గడుపుతున్నారు. నాలుగు రోజులుగా చిరుతజాడ తెలియక మరింత ఆందోళన చెందుతున్నారు. అసలు చిరుతపులి ఇక్కడే ఉందా.. లేక ఎటైనా వెళ్లిపోయిందా... ఉంటే ఎక్కడ ఉంది.. ఎటువైపుగా వచ్చి మీద పడుతుందోనని ఒకటే టెన్షన్‌ పడుతున్నారు. పదిరోజులుగా తెల్లవారుజామునే వాకింగ్‌కు వెళ్లడం లేదు. సాయంత్రం పిల్లల్ని ట్యూషన్లుకు పంపలేకపోతున్నారు. ఇంకెన్నాళ్లండి.. ఈ భయం.. అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.. 


మొదటిసారి కనిపించింది ఇక్కడే...
రాజమండ్రి లాలాచెరువు సమీప ప్రాంతాల్లో చిరుతపులి సంచారం చేస్తుందని ఆనోట ఈనోట వినడమే కానీ చూసిందెవ్వరూ లేరు. అయితే ఈనెల ఆరో తేదీన హైవే దాటుతూ చిరుతపులి ఓ జంతువును నోట కరచకుని ఆకాశవాణి కేంద్రం రోడ్డు వైపుగా వెళ్లడం చూశామంటూ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచే చిరుతపులి ఈప్రాంతంలో తిరుగుతుందని తెలిసిందని పలువురు చెబుతున్నారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఆకాశవాణి కేంద్రంలో ఉన్న


సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. 
సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి అటవీశాఖ అధికారులే కాదు.. అక్కడి ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆరోతేదీ రాత్రి 11.40 నిమిషాలకు ఆకాశవాణికి వెళ్లే మార్గంలో పందిని వెంబడిస్తూ వెళ్లిన చిరుత దృశ్యాలు చూసిన అధికారులు పుకార్లు కాదు వాస్తవమేనని నిర్ధారించారు. దీంతో మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. లాలాచెరువు, దివాన్‌ చెరువు ప్రాంతాలతోపాటు సమీప ప్రాంతాలైన హౌసింగ్‌బోర్డు కాలనీ, ఆటోనగర్‌, స్వరూపనగర్‌, శ్రీరూపా నగర్‌, శ్రీరామ్‌పురం ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


చిక్కక దొరక్క ముప్పు తిప్పలు పెడుతూ..
చిరుతపులి సంచారంపై నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు ఇంఛార్జ్‌ డీఎఫ్‌వో ఎస్‌.భరణి నేతృత్వంలో సిబ్బంది చిరుతను బంధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. తొలుత 30కు పైగా ట్రాప్‌ కెమెరాలను 3 ట్రాప్‌ బోన్లు ఏర్పాటు చేశారు. అయినా చిరుత చిక్కలేదు. దీంతో 50కుపైగా ట్రాప్‌ కెమెరాలు, 5 ట్రాప్‌కేజ్‌లను ఏర్పాటు చేశారు. మూడు సార్లు ట్రాప్‌కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డు అయ్యింది. కానీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ బోన్లు వైపు కన్నెత్తికూడా చూడలేదు. దీంతో 70కు పైగా ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు 7 ట్రాప్‌ బోన్లును ఏర్పాటు చేశారు. మరోపక్క థర్మల్‌ డ్రోన్లు సాయంతో అటవీప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు. అయినా చిరుత జాడ తెలియని పరిస్థితి కనిపిస్తోంది.. 


ఇంతకీ అటవీభూముల్లోనే ఉందా...
రాజమండ్రి లాలా చెరువు సెంటర్‌కు కేవలం 500 మీటర్లు దూరంలో హైవేను ఆనుకుని ఓ వైపు అటవీశాఖ శిక్షణ కార్యాలయం, మరోపక్క అటవీశాఖ రేంజర్‌ కార్యాలయం ఉంది. వీటిని ఆనుకుని సుమారు 950 ఎకరాలకుపైగా అడవి ఉంది. ఇది చాలా దట్టంగా చెట్లు, పొదలతో నిండి ఉంటుంది. రాత్రి వేళల్లో అప్పుడుప్పుడు బయటకు వస్తున్న చిరుత పగటి వేళ మాత్రం పూర్తిగా ఈ అడవిలోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 


ట్రాప్‌ కెమెరాల్లో రికార్డైన మూడుసార్లు అడవిలోనే చిరుత కనిపించింది. అలా అని ఆవాస ప్రాంతాల మధ్య దాని ఆనవాళ్లు(పగ్‌ మార్కులు) అయితే లభ్యం కాలేదు. శ్రీరామ్‌పురం ప్రాంతంలో చిరుత పగ్‌ మార్కులు కనిపించాయని సమాచారం మేరకు పరిశీలించిన అటవీశాఖ అధికారులు అవి అడవిపిల్లివిగా గుర్తించారు. అదే సమయంలో ట్రాప్‌ కెమెరాల్లోనూ అది రికార్డు అయ్యిందని ఫోటో విడుదల చేశారు. 


ఇంతకి చిరుత ఉందా.. వెళ్లిపోయిందా..?
పది రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న చిరుత పులి ఇంతకీ ఈ అడవిలోనే ఉందా లేక వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయిందా అన్న మాటకు సమాధానం మాత్రం దొరకడం లేదు. అడ్డతీగల అటవీ ప్రాంతం నుంచి దారితప్పి ఇటువైపుగా చిరుత వచ్చిందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయుంటే ఈమార్గంలో రాజానగరం నియోజవర్గ పరిధిలోకి వచ్చే చాలా గ్రామాలున్నాయి. అవన్నీ దాటుకు వెళ్లే క్రమంలో ఎవరో ఒకరి కంట పడే అవకాశం లేకపోలేదని, చిరుతపులి ఇక్కడే ఉందని మాత్రం స్థానికులు చెబుతున్నారు. 


Also Read: తూర్పు గోదావరి జిల్లాలో పులి కలకలం, సీసీ కెమెరాలో రికార్డ్ - ప్రజలకు డీఎఫ్‌ఓ జాగ్రత్తలు