Andhra Pradesh News: నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వైసీపీ వచ్చాక ఏకంగా 9మందికి ఆ అవకాశం లభించింది. కానీ 2024 ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం పోస్ట్ కేవలం పవన్ కి మాత్రమే లభించింది. మరి ఈ అరుదైన అవకాశాన్ని పవన్ ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయన 100 డేస్ పాలన ఎలా ఉంది..?


పవన్ కల్యాణ్ సినిమాల్లో శతదినోత్సవాలు చాలానే చూసి ఉంటారు. కానీ రాజకీయంగా.. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, డిప్యూటీసీఎంగా పవన్ కి ఇది ఫస్ట్ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్. దీన్ని నిజంగానే జనసేన ఓ సెలబ్రేషన్ లా చేస్తోంది. అసెంబ్లీ గేటుని కూడా టచ్ చేయలేరు అంటూ ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే అర్హత కోల్పోగా.. వైరి వర్గాల విమర్శలు తట్టుకున్న పవన్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారని జనసైనికులు గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక ప్రత్యేకించి పాలనలో పవన్ కల్యాణ్ ముద్ర ఏంటి అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 


డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఓ ప్రపంచ రికార్డ్ సాధించారు. పవన్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఆ శాఖకు ఈ ఘతన దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధులు రికార్డ్ పత్రాన్ని, మెడల్ ని డిప్యూటీ సీఎం పవన్ కి అందించారు. 


రికార్డ‌్‌ల సంగతి పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ తన శాఖలపై పట్టు పెంచుకోడానికి ఎక్కువ సమయం కేటాయించారని తెలుస్తోంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం-అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా అన్ని శాఖలతో ఆయన సమీక్షలు నిర్వహించి.. అధికారుల నుంచి సమాచారం సేకరించి అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత పనిలోకి దిగారు. 


100 రోజుల ఎన్డీఏ కూటమి పాలనలో పంచాయతీలకు పునరుజ్జీవం కల్పించామన్నారు పవన్ కల్యాణ్. 15వ ఆర్థిక సంఘం నిధులు.. రూ.998.62 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 70శాతం పంచాయతీల్లో వైసీపీ నాయకులే సర్పంచ్ లు గా ఉన్నా కూడా తాము అందర్నీ సమానంగా చూస్తున్నామని చెప్పారు పవన్. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల వ్యపరిమితిని గణనీయంగా పెంచామన్నారు. ఉపాధి కూలీలకు గత ప్రభుత్వం వేతనాలు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక రూ.2,081 కోట్లు బకాయిలు చెల్లించామన్నారు. అనంతపురం జిల్లాలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు 8 నెలలుగా గత ప్రభుత్వం జీతాలివ్వలేదని.. వారికి కూడా రూ. 30 కోట్లు విడుదల చేశామన్నారు. 100 రోజుల పాలనలో తన శాఖల పరంగా జరిగిన పనులు ఇవీ అని ధీమాగా చెబుతున్నారు పవన్. 


రాజకీయ నిర్ణయాలు..
టీడీపీ నేతలు రెడ్ బుక్ అంటూ హడావిడి చేస్తున్నా పవన్ మాత్రం అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ మౌనం జనసైనికులకు నచ్చడంలేదు. కనీసం తనను విమర్శించిన నేతలను కూడా పవన్ పల్లెత్తు మాట అనడంలేదు. అధికారంలోకి వచ్చాక జగన్ పై కూడా ఎక్కడా మాట తూలలేదు. విజయవాడ వరదల సమయంలో పవన్ కల్యాణ్ అడ్రస్ లేరంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను నేరుగా సహాయక చర్యలకు వస్తే అధికారుల, సిబ్బంది పనులకు ఆటంకం కలుగుతుందని ఆ విమర్శలకు వివరణ ఇచ్చారు పవన్. బాధితులకు తన సొంత నిధులను విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.


Also Read: దీపావళి నుంచే ఏపీలో ఉచిత గ్యాస్, నేటి నుంచే బంగ్లాదేశ్ తో తొలి టెస్టు -మార్నింగ్ టాప్ న్యూస్


ఇటీవల జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా జనసేన పారదర్శకంగా వ్యవహరించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన్ను పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టి పవన్ కల్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని.. తప్పులు చేసి దొరికిపోయినా వైసీపీ నేతలపై వేటు వేసేందుకు జగన్ వెనకాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఈ 100 రోజులు పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. ముందు ముందు డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 


Also Read: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్