India vs Bangladesh Highlights :  బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత భారత్‌ను భయపెట్టింది. వరుసగా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్‌ హసన్ మహమ్మూద్‌ భారత టపార్డర్‌ను కకావికలం చేశాడు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లీ, పంత్‌లను అవుట్‌ చేసి హెచ్చరికలు జారీ  చేశాడు. ఈక్రమంలో 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాను అశ్విన్‌-రవీంద్ర జడేజా ఆదుకున్నారు. వీరిద్దరూ టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపించారు. అశ్విన్‌ సెంచరీతో చెలరేగగా.. జడేజా 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ అభేద్యమైన ఏడో వికెట్‌కు  195 పరుగులు జోడించారు. దీంతో భారత జట్టు తొలి రోజును ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులతో  సంతృప్తికరంగా ముగించింది.


 






ఆరంభం బంగ్లాదే..


చెన్నై చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌... తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఆరంభంలో భారత బ్యాటర్లకు.. బంగ్లా బౌలర్‌ హసన్ మహమూద్‌ చుక్కలు చూపించాడు. వరుసగా వికెట్లు తీస్తూ భారత టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఆరు ఓవర్లో జట్టు స్కోరు 14 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన రోహిత్‌ శర్మను.. హసన్ మహమ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు కూడా హసన్ మహమ్మద్‌కే దొరికిపోయారు. సున్నా పరుగులు చేసి గిల్.. ఆరు పరుగులు చేసి విరాట్‌ కోహ్లీ, 39 పరుగులు చేసి పంత్... పెవిలియన్‌కు చేరారు. పంత్‌ కాసేపు పోరాడినా హసన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ మాత్రం అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. చాలా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసిన జైస్వాల్‌ 118 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక భారత స్కోరు 200 పరుగులు దాటడం కూడా కష్టమే అని భావిస్తున్న వేళ ఆల్‌రౌండర్లు అశ్విన్‌-జడేజా అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఆపద్బాంధవుడిలా మారారు.


Read Also: అసలు ఎవరీ హసన్? అంత తోపా? కోహ్లీ, రోహిత్‌నే అవుట్‌ చేసేంత బౌలరా ?


ఆపద్భాందవులు అశ్విన్‌-జడేజా:


144 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడుతూ అశ్విన్‌కు సహకారం అందించాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అశ్విన్‌ 102 పరుగులు, జడేజా 86 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి పోరాటంతో తొలిరోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. భారత జట్టు తొలి రోజును ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులతో సంతృప్తికరంగా ముగించింది.