Who Is Hasan Mahmud: చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహమూద్(Hasan Mahmud) మెరిశాడు. భారత టాపార్డర్‌ను కకావికలం చేశాడు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat kohli)ని పెవిలియన్‌కు చేర్చి సంచలనం సృష్టించాడు. దీంతో క్రికెట్(Cricket) ప్రపంచంలో హసన్ మహమూద్ పై చర్చ ఆరంభమైంది. వరుస విరామాల్లో వికెట్లు తీసిన హసన్... భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. డ్రింక్స్ సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోగా.. ఆ నాలుగు వికెట్లను హసన్ మహమూద్ తీశాడు. భారత్‌లో స్పిన్ పిచ్‌పై అంత అద్భుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటింగ్ వెన్ను విరిచిన ఈ హసన్ మహమూద్ ఏవరంటే...?
హసన్ ఎక్స్‌ప్రెస్..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ కీలకంగా మారాడు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న ఈ సీమర్... అద్భుతాలు చేస్తున్నాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లోనూ కీలక వికెట్లను నెలకూల్చి తాను ఎంత ప్రమాదకరమైన బౌలరో చాటిచెప్పాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లను అవుట్ చేసి టీమిండియాను చావు దెబ్బ కొట్టాడు. స్వదేశంలో భారత స్టార్ ఆటగాళ్లను వరుసగా అవుట్ చేసి హసన్ సంచలనమే సృష్టించాడు. మొదటి సెషన్‌లో పిచ్ సీమర్లకు అనుకూలించడంతో హసన్ చెలరేగిపోయాడు. ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ఆరు పరుగులకే హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. కాసేపటికే పరుగులేమీ చేయకుండానే శుభ్‌మన్ గిల్‌ను పెలిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీని హసన్ అవుట్ చేశాడు. ఆరు పరుగులే చేసి కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 39 పరుగులు చేసిన రిషభ్ పంత్‌ను బలి తీసుకున్నాడు. రోహిత్ శర్మ మినహా మిగిలిన ముగ్గురు కీపర్ లిట్టన్ దాస్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. హసన్ మహ్మద్ ఏడు ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 14 పరుగులే ఇచ్చాడంటే అతడు ఎంత ప్రభావం చూపాడో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఎవరీ అజాజ్ పటేల్, ఎక్కడి వాడు, ఏం సాధించాడు?
అరంగేట్రం నుంచి అద్భుతాలే
24 ఏళ్ల హసన్ మహమూద్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచే తన సీమ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని, అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మహ్మద్ తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ మూడే టెస్టులు ఆడిన హసన్ 14 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 30 వికెట్లు, T20ల్లో 18 వికెట్లు సాధించాడు.