ICC Women's T20 World Cup 2024:  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి మహిళల టీ 20 ప్రపంచకప్(Women's T20 World Cup 2024) జరగనుంది. మొత్తం పది జట్లు ఈసారి టైటిల్ కోసం పోరాడుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కప్పును ముద్దాడని భారత జట్టు(TeamIndia).. ఈసారి ఎలాగైనా కప్పును ఒడిసి పట్టాలని చూస్తుంది. అందుకోసం సన్నద్ధం అవుతోంది. ఈ మెగా టోర్నీలో విజయంలో కీలక పాత్ర పోషించే ఒత్తిడిని తట్టుకునేందుకు.. మానసిక స్థైర్యాన్ని పెంచుకునేందుకు ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. 

 




ఒత్తిడినే జయిస్తేనే...
అసలే ప్రపంచకప్.. అందులోనా టీ 20 మ్యాచులు.. ఇంకేం ఆటగాళ్లపై కావాల్సినంత ఒత్తిడి ఉంటుంది. అదీకాక పురుషులు టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత మహిళల జట్టు కూడా... పొట్టి ప్రపంచకప్‌ కల నెరవేర్చాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో టీమిండియా ఉమెన్స్ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ క్రమంలోనే భారత జట్టు ఒత్తిడిని జయించి ఆత్మ స్థైర్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  దీనిపై టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కీలక వ్యాఖ్యలు చేసింది. కీలకమైన క్షణాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు.. ఒత్తిడిని జయించేందుకు ఆటగాళ్లందరూ కృషి చేస్తున్నారని హర్మన్ ప్రకటించింది. "మేము చాలా కాలంగా మానసిక దృఢత్వం కోసం పని చేస్తున్నాం. టీ 20 మ్యాచుల్లో చివరి 3-4 ఓవర్లు అత్యంత కీలకం. చివరి ఓవర్లలో మానసికంగా బలంగా ఉన్న జట్టు మ్యాచ్‌ను గెలుస్తుంది. అందుకే కొంతకాలంగా మేం దానిపై దృష్టి పెట్టాం. చివరి ఐదు ఓవర్లలో మానసికంగా స్థిరంగా ఉంటే మ్యాచులు గెలవడం తేలికవుతుంది" అని హర్మన్ తెలిపింది. 2020 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టు.. 2017 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో  కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఫైనల్ ఫోబియాను జయించేందుకు.. ఒత్తిడిని తట్టుకుని అద్భుత పోరాటం చేసేందుకు మానసికంగా స్థైర్యంగా ఉండాలని.. దాని కోసమే భారత ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హర్మన్ తెలిపింది. " ఒత్తిడిని జయిస్తాం.. ఈ మెగా టోర్నమెంట్‌లో విజయం సాధిస్తాం" అని హర్మన్ వెల్లడించింది


Also Read: కోహ్లీ నోట ఓం నమఃశివాయ, గంభీర్ మనసులో హనుమాన్ చాలిసా


క్లిష్టమైన గ్రూప్‌లో
మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భారత్ క్లిష్టమైన గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌ ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి. భారత్ అక్టోబరు 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ ఏడాది మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. అక్టోబర్ 9న లంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు. అక్టోబర్ 13న షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.