India vs Bangladesh 1st Test  Preview and Prediction:  ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్( India)జట్టుకు నిజమైన టెస్ట్ ఎదురుకాబోతోంది. టీ 20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచి ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్(Bangladesh) తో టెస్ట్ కు సిద్ధమైంది. పాకిస్థాన్(Pakistan) ను వారి దేశంలో చిత్తుగా ఓడించి ఎనలేని ఆత్మ విశ్వాసంతో ఉన్న బంగ్లా జట్టు..టీమిండియాతో మ్యాచులో ఎలా ఆడబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. స్వదేశంలో భారత జట్టును ఓడించడం అంత సులభం కాకపోయినా..బంగ్లాదేశ్ ఉన్న ఫామ్ లో ఏదైనా సాధ్యమే అని అనిపిస్తోంది. భారత జట్టుపై ఇప్పటివరకూ ఒక్క టెస్టు మ్యాచు కూడా గెలవని బంగ్లాదేశ్.. ఆ రికార్డును కాలగర్భంలో కలిపేయాలని చూస్తోంది. ఆ రికార్డును పదిలంగా ఉంచుకోవాలని రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది. మరి గురువారం నుంచి చెన్నైలో జరిగే ఈ మ్యాచులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.





 

ప్రతీసారి పరాజయమే

భారత్-బంగ్లాదేశ్ ఇప్పటివరకూ 13 టెస్టు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ 13 మ్యాచుల్లో ఒక్కసారి కూడా బంగ్లా విజయం సాధించలేదు. 11 మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా... రెండు టెస్టు మ్యాచులు డ్రా అయ్యాయి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే పాక్ గడ్డపై చరిత్ర సృష్టించి.. భారత గడ్డపై కాలుమోపింది. మరోవైపు టీమిండియా ఆరు నెలలుగా ఒక్క టెస్టు మ్యాచు కూడా ఆడలేదు. భారత్ ను స్వదేశంలో ఓడించడం ప్రతీ జట్టు కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు బంగ్లా సమాయత్తమైంది. అయితే భారత్‌లో టీమిండియాతో మూడు టెస్టులు ఆడిన బంగ్లా.. మూడుసార్లు ఘోరంగా ఓడిపోయింది. గత పదేళ్లలో భారత్ స్వదేశంలో కేవలం నాలుగు టెస్టుల్లోనే  ఓడిపోయింది. ఒక్క సిరీస్ ను కూడా కోల్పోలేదు. ఈ గణాంకాలు బంగ్లాను భయపెడుతున్నాయి. 

 

బంగ్లా అప్పటిలా లేదు

2022 ప్రారంభంలో బంగ్లాదేశ్.. న్యూజిలాండ్ జట్టును ఓడించింది. గత నెలలో మొదటిసారిగా పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కానీ ఇప్పటివరకూ 67  టెస్టు మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ కేవలం ఎనిమిది మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఇది వారికి ప్రతికూలంగా మారనుంది. ఈ మ్యాచులో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 68.52 శాతంతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. కానీ ఆరు నెలలుగా భారత జట్టు టెస్టు మ్యాచు ఆడలేదు. భారత టాపార్డర్ ఆటగాళ్లు అందరూ  చాలాకాలం నుంచి టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్నారు. వీరు ఎలా రాణిస్తారో చూడాలి. 

 


 

స్పిన్నర్లే కీలకం 

బంగ్లాదేశ్ జట్టుకు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్,తైజుల్ ఇస్లామ్ లతో ఆ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉన్న వేళ ఈ ముగ్గురు స్పిన్నర్లను భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ మ్యాచులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అశ్విన్, రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్ ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉండడం ఖాయమే.