Virat Kohli And Gautam Gambhir Appeared Together In An Interview Video Goes Viral:  మైదానంలోనూ.. బయట ఉప్పు-నిప్పులా ఉండే విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్లను(Virat Kohli And Gautam Gambhir) కలిపి బీసీసీఐ(BCCI) చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. ఐపీఎల్ లో మైదానం కోహ్లీతో గంభీర్ వాగ్వాదానికి దిగిన తర్వాత విరాట్ అభిమానులు గంభీర్ ను ట్రోల్ కూడా చేశారు. ఆ తర్వాత గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడంతో వీరిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా అని చాలామంది ప్రశ్నించారు. అయితే ఈ ఒక్క ఇంటర్వ్యూతో అనుమానాలు పటాపంచలు అయిపోయాయి. ఈ  ఇంటర్వ్యూలో గంభీర్-కోహ్లీ వారి కెరీర్ గురించి.. విరాట్ టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి పరిస్థితుల గురించి.. భారత బౌలింగ్ దళం గురించి చాలాసేపు ముచ్చటించుకున్నారు. 





 

హనుమాన్ చాలిసా గురించి చర్చ...

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఆటతో పాటు దూకుడుతో కూడా వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ అయినా, టీమ్ ఇండియా అయినా.. వీరిద్దరూ ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడంలో వెనుకంజ వేయరు. అలాంటి ఇద్దరు ఆటగాళ్లు బీసీసీఐ చేసిన ఇంటర్వ్యూలో స్లెడ్జింగ్ గురించి కాకుండా హనుమాన్ చాలీసా గురించి చర్చించుకున్నారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ తమ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుకున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులు చేశాడని గౌతమ్ గంభీర్ గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఓం నమఃశివాయ్ అని జపించేవాడని గంభీర్ వెల్లడించాడు. నాలుగు మ్యాచుల ఆ టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతను నాలుగు సెంచరీలు చేశాడు. ఈ సిరీస్‌లో ప్రతి బంతిని ఎదుర్కొనే ముందు కోహ్లీ ఓం నమఃశివాయ్ అని చెప్పేవాడని గంభీర్ చెప్పాడు. గంభీర్ 2009 సంవత్సరంలో నేపియర్‌పై తన ఇన్నింగ్స్ గురించి కూడా మాట్లాడాడు. 2009లో న్యూజిలాండ్‌పై గంభీర్ 436 బంతులు ఎదుర్కొని 137 పరుగులు చేశాడు. ఆ సమయంలో తాను హనుమాన్ చాలీసాను నిరంతరం వింటూనే ఉన్నానని గంభీర్ చెప్పాడు. హనుమాన్ చాలిసా తన ఏకాగ్రత పెంచడానికి సహాయపడిందని గంభీర్ తెలిపాడు. 





 

కోహ్లీ పెద్ద ఫైటర్

స్లెడ్జింగ్ గురించి కూడా విరాట్ కోహ్లీ, గంభీర్‌ స్పందించారు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదాలు ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయని కోహ్లీ.. గంభీర్ ను అడిగాడు. అయితే ఇదే ప్రశ్నకు ముందు కోహ్లీ సమాధానం చెప్పాలని గంభీర్ నవ్వుతూ అన్నాడు. అయితే స్లెడ్జింగ్ తమ ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపదని ఇద్దరు ఆటగాళ్లు తెలిపారు.

 

ధోనీ రిటైర్ తర్వాత

2015 ప్రారంభంలో MS ధోని రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీని విరాట్ కోహ్లీకి అప్పగించినప్పుడు కాస్త ఆందోళన చెందానని గంభీర్ అన్నాడు. 25 ఏళ్ల వయసులో కోహ్లీకి పెద్ద బాధ్యత అప్పగించినట్లు అనిపించిందన్నాడు. అయితే ఏడేళ్ల తర్వాత చూస్తే టెస్టుల్లో 40 విజయాలు సాధించి కోహ్లీ విజయవంతమైన కెప్టెన్లలో ఒక్కడిగా నిలిచాడని ప్రశంసించాడు. టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ తనకు ఒక సవాలని.. దానిని ఎదుర్కొన్నామని కోహ్లీ కూడా తెలిపాడు.