Mumbai Actress Jethwani Meet Home Minister Anitha: తనపై అక్రమ కేసులు, వేధింపులపై విచారణ జరిపి.. కేసును విత్ డ్రా చేసుకోవాలని ముంబై నటి కాదంబరీ జత్వానీ (Kadambari Jethwani) కుటుంబం హోంమంత్రి అనితకు (Anitha) విజ్ఞప్తి చేశారు. నటి జత్వానీ, ఆమె తల్లిదండ్రులు  సచివాలయంలో గురువారం హోంమంత్రిని కలిసి అరగంట పాటు భేటీ అయ్యారు. కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లిదండ్రుల పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును హోంమంత్రికి వివరించారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


'ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు'


గతంలో పోలీసులు తన విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోం మంత్రి అనితకి వివరించినట్లు నటి కాదంబరీ జత్వానీ తెలిపారు. 'పోలీసులు నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో దారుణంగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది. నాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంకా విచారణ కొనసాగుతోంది. నాపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను పూర్తి స్థాయి విచారణ తర్వాత సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికీ జరగకూడదు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరాను. నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహరం కోరుతున్నా.' అని జత్వానీ పేర్కొన్నారు.


'వ్యక్తిత్వ హననం చేస్తున్నారు'


నటి జత్వానీని కొందరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆమె తరఫు లాయర్ నర్రా శ్రీనివాసరావు అన్నారు. 'ఈ కేసు రూట్ కాజ్ ఏంటో అందరికీ తెలుసు. ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వానీపై ఏపీలో కేసు పెట్టారు. ఇక్కడ ఉన్న కేసు క్లోజ్ అయితే.. ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతాం. ఐపీఎస్‌లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. జత్వానీ మీద కేసును విత్ డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుంది. చట్టం అందర్నీ సమానంగానే చూడాలి. కుట్రకు మూలం ఎవరు..? తెర వెనుక పెద్దలు ఎవరనేది విచారణలో తేలుతుంది. జత్వానీ ఫోన్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఫోన్ ఎక్కడ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారో మెసేజ్ కూడా వచ్చింది. జత్వానీని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరికైనా చెప్పారా..? కాపీలు ఇచ్చారా..?.' అని ఆయన పలు ప్రశ్నలు సంధించారు.


కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని ముంబై నటి జత్వానీ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఇటీవలే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా (Kanti Rana), ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీలను (Vishal Gunni) సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు. అటు, పరారీలో ఉన్న వైసీపీ నేత విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. విద్యాసాగర్ దొరికితే కుట్ర కోణం వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్నారు.


Also Read: Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు