Walkie Talkies Explosion In Lebanon : లెబనాన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 17)న దేశవ్యాప్తంగా వేలాది పేజర్లు పేలి సృష్టించిన విధ్వంసం మరిచిపోక ముందే.. మరుసటి రోజు మరో కమ్యూనికేషన్ వ్యవస్థ అయిన వాకీటాకీలు కూడా పేలి మరో 20 మంది మృత్యువాత పడగా వేలాదిగా గాయపడ్డారు. ఈ ఘటనలకు ఇజ్రాయెల్ కారణంగా భావిస్తున్న లెబనాన్.. రాకెట్ లాంచర్లతో సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ సైనిక శిబిరాలపై దాడి చేస్తోంది. లెబనాన్ దాడులకు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగడంతో మధ్యప్రాశ్చ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
బుధవారం నాడు లెబనాన్ వ్యాప్తంగా పేలిన వేలాది వాకీటాకీలు:
మంగళవారం నాడు లెబనాన్‌లోని హెజ్బుల్లా తీవ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకొని పేజర్ల పేలుడు దాడి జరగ్గా.. 12 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 3న్నర వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియా ఇరాన్‌లోనూ ఈ తరహా పేలుళ్లు సంభవించాయి. అయితే లెబనాన్‌లోనే నష్టం ఎక్కువగా జరిగింది. అది జరిగి 24 గంటలు కూడా గడవక మునుపే.. బుధవారం (సెప్టెంబర్ 18) న మరోసారి కమ్యూనికేషన్ వ్యవస్థలు, సోలార్ వ్యవస్థలు లక్ష్యంగా జరిగిన దాడులు విధ్వంసం సృష్టించాయి. వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చిన ఘటనలో 20 మందికి పైగా మృత్యువాత పడగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు రోజుల కమ్యూనికేషన్ ఉపకరణాల పేలుళ్లలో 32 మందికి పైగా చనిపోగా.. దాదాపు 4 వేల మంది వరకూ గాయపడ్డట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం నాటి పేజర్ల పేలుళ్లలో చనిపోయిన ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యుల అంత్యక్రియలు బైరుట్‌లో నిర్వహించగా.. ఆ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు. ఆ సమయంలో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చినట్లు తేలింది. తీరనగరం సిడోన్‌లో కారులో పేలుడు సంభవించగా.. బైరుట్‌లో వివిధ సౌర ఉపకరణాలతో పాటు హెజ్‌బుల్లా సభ్యుల చేతుల్లో ఉండే రేడియోలు కూడా పేలాయి.
ఆ వాకీటాకీలు తమవి కాదన్న జపాన్ కంపెనీ:
మంగళవారం నాటి పేజర్ పేలుళ్లు తమవి కాదని తైవాన్ సంస్థ గోల్డ్ అపోలో స్పష్టం చేసింది. తమకు బీఏసీ సంస్థతో ఒప్పందం ఉందని.. ఈ పేజర్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ సంస్థదేనని గోల్డ్ అపోలో తెలిపింది. బుధవారం నాటి పేలుళ్లలో వినియోగించిన వాకీటాకీలను హెజ్‌బొల్లా సంస్థ ఆరు నెలల కిందట కొనుగోలు చేసింది. వాటిపై ఉన్న ఐకామ్ సింబల్ ఉంది. ఇది జపాన్‌కు చెందిన రెడియే కమ్యూనికేషన్స్ కంపెనీ కాగా.. ఆ తరహా కమ్యికేషన్ వ్యవస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఆపేసినట్లు తెలిపింది.
Also Read: టప్పర్‌వేర్ ఇంత షాక్ ఇచ్చిందేంటి గురూ, తట్టుకోవడం కాస్త కష్టమే!
మధ్యప్రాశ్చ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు:
రెండు రోజుల్లో వరుస విధ్వంసపు ఘటనలతో లెబనాన్ సహా మధ్య ప్రాశ్చ్యం మొత్తం ఉలిక్కి పడింది. ఈ ఘటనలకు ఇజ్రాయెలే కారణం అంటూ ఆరోపిస్తున్న లెబనాన్.. ఇజ్రాయెల్ సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. అటు ఇజ్రాయెల్ కూడా సరిహద్దుల్లోకి సైన్యం మొహరింపును పెంచింది. యుద్ధం మరో దశకు చేరిందన్న ఇజ్రాయెల్ రక్షణశాఖ.. సైనికులు మరింత అంకితభావం, ధైర్యాన్ని ప్రదర్శించాలని ప్రకటించింది. పేజర్ల ఘటనపై స్పందించిన ఆమెరికా విదేశీ వ్యవహారాల సెక్రెటరీ ఆంటోనీ బ్లింకెన్.. ఇది మధ్య ప్రాశ్చ్యంలో శాంతి చర్చలకు విఘాతం కలిగించే అంశమేనని తెలిపింది. మరోవైపు గాజాతో పాటు ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలంటూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాల్లో 124 అనుకూలంగా.. 12 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్ సహా 40 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఎవరు ఏది అనుకుంటున్నా.. లెబనాన్‌లో పేలుళ్ల ఘటనల వెనుక ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ ఉందనడానికి గతంలో వారు జరిపిన దాడులే సమాధానంగా ఉన్నాయని.. అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మ్యూనిఖ్ ఘటనకు వ్యతిరేకంగా 1970ల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించుకొని శత్రువులను మొస్సాద్ మట్టుపెట్టిన ఘటనలు ఉన్నాయి. 1996లో హమాస్ బాంబు తయారీ నిపుణుడ్ని సెల్‌ఫోన్ బాంబు ద్వారా చంపారు. హమాస్ అగ్ర కమాండర్‌ను కూడా ఇదే రీతిలో ఇంట్లో ఉండగానే రిమోట్ ఆయుధాలతో అంతమొందించింది. అందుకే లెబనాన్ పేలుళ్ల వేళ కూడా అన్నివేళ్లూ ఇజ్రాయెల్ వైపే చూపిస్తున్నాయి.
Also Read: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?