Tupperware Is Bankrupt: టప్పర్‌వేర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాలి చొరబడకుండా ఆహారాన్ని నిల్వ చేయడంలో ఈ కంపెనీ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. టిఫిన్‌ బాక్స్‌ల నుంచి లంచ్‌ బాక్స్‌ల వరకు, వాటర్‌ బాటిల్స్‌ నుంచి ఫుడ్‌ కంటైనర్స్‌ వరకు.. దీని ప్రొడక్ట్స్‌ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రతి ఇంటి వంటగదిలో, ఈ కంపెనీ నుంచి కనీసం ఒక్క డబ్బా అయినా మనకు కనిపిస్తుంది. ప్రపంచ ప్రజలకు ప్రియమైన టప్పర్‌వేర్‌ ఒక గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ కంపెనీ దివాలా (bankruptcy) తీసింది. 


టప్పర్‌వేర్‌ బ్రాండ్స్‌ కార్ప్‌ (Tupperware Brands Corp)ను, 1946లో, ఎర్ల్ టప్పర్ అమెరికాలో ప్రారంభించారు. మొదట్లో బెల్‌ షేప్‌లో ప్రొడక్ట్స్‌ తయారు చేశారు. 1950 నాటికి ఇది ప్రతి అమెరికన్‌ ఇంట్లో నాటుకుపోయింది. అక్కడి నుంచి ప్రపంచమంతా పాకింది.


కరోనా సమయంలో రాకెట్స్‌ సేల్స్‌                        
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో, చాలా కుటుంబాలు ఎక్కువగా వండిన & మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేయడానికి టప్పర్‌వేర్‌ బాక్సులను బాగా ఉపయోగించాయి. ఆ సమయంలో టప్పర్‌వేర్ అమ్మకాలు రాకెట్‌లా పెరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ టప్పర్‌వేర్‌ సేల్స్‌ కూడా పెరిగాయి. అయితే, మహమ్మారి మాయమైన తర్వాత టప్పర్‌వేర్‌ అమ్మకాలు కూడా క్షీణించాయి. 


ఫుడ్‌ స్టోరేజీ సెగ్మెంట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన ఈ కిచెన్‌వేర్ కంపెనీకి 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయి. వ్యాపారంలో కొనసాగే సామర్థ్యంపై సందేహాలు పెరిగాయి. అమ్మకాలు తగ్గడంతో పాటు ఈ రంగంలో పోటీ పెరగడంతో సంవత్సరాలుగా మార్కెట్‌కు ఎదురీదుతోంది. ఈ సంవత్సరం జూన్ నాటికి, దాని ఏకైక US ఫ్యాక్టరీని మూసేయాలని, దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్‌ కూడా చేసింది. చివరకు, టప్పర్‌వేర్‌ కంపెనీ దివాలా తీసింది.


నెత్తిన అప్పుల కొండ                  
బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ చెబుతున్న ప్రకారం, ఈ గృహోపకరణాల బ్రాండ్‌ నెత్తిన భారీ స్థాయి అప్పుల కొండ ఉంది. పబ్లిక్‌-ట్రేడెడ్ కంపెనీ అయిన టప్పర్‌వేర్‌, న్యాయపమరైన రక్షణ కోసం దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కంపెనీకి 500 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్ల మధ్య ఆస్తులు; 1 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్‌ డాలర్ల మధ్య అప్పులు ఉన్నట్లు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.


రుణం తిరిగి చెల్లించేందుకు అదనపు సమయం ఇవ్వడానికి రుణదాతలు అంగీకరించినప్పటికీ, అప్పు తీర్చగలదన్న నమ్మకం వాళ్లకూ లేదు, కంపెనీకీ లేదు. ఎందుకంటే సేల్స్‌ కౌంట్‌ నానాటికీ పడిపోతూనే ఉంది. 


IP పెట్టి కోర్టు రక్షణలోకి ప్రవేశించింది కాబట్టి, ఈ మ్యాటర్‌ న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. బిలియన్‌ డాలర్ల రుణాన్ని తిరిగి ఎలా చెల్లించాలన్న విషయం ఇక అక్కడే తేలుతుంది.


మరో ఆసక్తికర కథనం: వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?