Edible Oil Rates: మన దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభమైంది. అక్టోబర్‌ నెలలో దసరా (Dasara 2024), దీపావళి (Deepavali 2024) పర్వదినాలు ఉన్నాయి. పిండివంటలు లేకుండా పండుగ పూర్తి కాదు. అయితే, మూడు రోజుల క్రితం, వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే, కొన్ని కంపెనీల నూనెల రేట్లు పెరిగాయి. లీటరు నూనె రేటు రూ.15 నుంచి రూ.20 వరకు ప్రియమైంది. గత శనివారం పొద్దున, లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.115గా ఉంటే, సాయంత్రానికల్లా అది రూ.130+కు చేరింది. మరికొన్ని కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి.


పండుగ సీజన్‌లో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వంట నూనెల రేట్లు పెంచొద్దని ఎడిబుల్‌ ఆయిల్‌ కంపెనీలకు సూచించింది. తక్కువ సుంకాలతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్‌ ఉన్నంతవరకు పాత రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లకు సలహా ఇచ్చింది. 


పాత రేట్లకే వంటనూనెలు
ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్' (DFPD) కార్యదర్శి, వంటనూనెల ధరలపై చర్చించారు. 0%, 12.5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో (BCD) దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు అయిపోయే వరకు ప్రతి రకం నూనె పాకెట్‌ మీద పాత MRPనే ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే అన్ని ఆయిల్‌ కంపెనీలకు చెప్పాలని సూచించారు.


ప్రస్తుతం, భారతదేశంలో దాదాపు 30 లక్షల మెట్రిక్‌ టన్నుల (LMT) వంటనూనెల నిల్వలు ఉన్నాయి. వీటన్నింటినీ 0%, 12.5%తో ​​BCD దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నిల్వలు మన దేశంలో 45 నుంచి 50 రోజుల వరకు సరిపోతాయి. కాబట్టి, ఆయిల్‌ రేట్లు పెంచొద్దని DFPD చెప్పింది.


గతంలో కూడా, ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లతో DFPD సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల తర్వాత సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వంటి నూనెల MRPలు తగ్గాయి.


దిగుమతి సుంకం పెంపు
దేశీయంగా నూనె గింజల రేట్లు పడిపోతుండడంతో, మన రైతులకు ప్రయోజనం కల్పించేందుకు భారత ప్రభుత్వం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ముడి పొద్దుతిరుగుడు పువ్వుల నూనె, ముడి పామాయిల్‌, ముడి సోయాబీన్‌ ఆయిల్‌ మీద ఇప్పటి వరకు ఎలాంటి ఇంపోర్ట్‌ డ్యూటీ లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఒకేసారి 20% చేసింది. వీటికి అదనంగా అగ్రికల్చర్‌ సెస్‌ కూడా వర్తిస్తుంది. దీంతో... క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై చెల్లించాల్సిన మొత్తం ఇంపోర్ట్‌ డ్యూటీ 27.5%కు చేరుకుంది.


రిఫైన్డ్‌ పామాయిల్‌ (refined palm oil), రిఫైన్డ్‌ సోయాబీన్‌ (refined soybean oil), రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ (refined sunflower oil) మీద ఇంపోర్ట్‌ డ్యూటీ 12.5%గా ఉంటే, దానిని 32.5%కు పెంచింది. దీనికి కూడా అగ్రికల్చర్‌ సెస్‌ కూడా వర్తిస్తుంది. తద్వారా శుద్ధి చేసిన నూనెలపై చెల్లించాల్సిన దిగుమతి సుంకం 35.75%గా మారింది. ఈ నెల 14 నుంచి కొత్త దిగుమతి సుంకాలు అమల్లోకి వచ్చాయి. 


కేంద్ర ప్రభుత్వం ఆదేశంలో ప్రస్తుతానికి వంటనూనెల రేట్లు పెరగకపోయినప్పటికీ, ప్రస్తుత నిల్వలు అయిపోయిన తర్వాత, మరో 45-50 రోజుల తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు కూడా పడిపోయిన పసిడి, వెండి రేట్లు - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి