Anasuya Reacts On Jani Master Case: తెలుగు సినిమా పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం, లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఇప్పటికే ఆయపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా ఈ కేసుపై నటి అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అయ్యింది. బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు న్యాయం జరగాలని చెప్పింది.
నిజంగా బాధాకరం..
ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ నిజంగా దారుణమన్నది అనసూయ. “అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు.. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రావాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ప్రతిఘటించాలి. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పని చేశాను. ‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అయ్యాయి. ఇలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు వోడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్మందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని భావిస్తున్నాను” అని అభిప్రాయపడింది.
జానీ మాస్టర్ పై అత్యాచారం సహా పలు కేసులు నమోదు
రీసెంట్ గా మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢీ షో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందన్న యువతి, ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినట్లు చెప్పింది. షోల పేరుతో ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపింది. షూటింగ్ సెట్స్ లో క్యారవాన్ లో లైంగిక వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ చిత్రహింసలు పెట్టారని చెప్పింది. ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసని చెప్పింది. ఆమె కూడా తన మీద దాడి చేసినట్లు వెల్లడించింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు.
Read Also: జానీ మాస్టర్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు