Dussehra Special Trains: పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు, ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం!
Dussehra Special Trains: దసరా, దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలాగే టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించింది.
Dussehra Special Trains: దసరా, దీపావళి పండుగల రద్దీ సందర్భంగా పలు ప్రాంతాలకు 30 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైళ్లలో ముందుస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కూాడా కల్పించినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విశాఖపట్నం - బెంగళూరు మధ్య అక్టోబర్ 3 నుంచి 31వ తేదీ వరకు బెంగళూరు- విశాఖపట్నం మధ్య 5 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.5 గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు, ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.0 గంటలకు బెంగళూరు నుంచి విశాఖకు రైలు బయల‌్దేరనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖపట్నం - తిరుపతి మధ్య 5, అక్టోబర్ 4 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు తిరుపతి - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ప్రతి సోమవారం రాత్రి 7.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి విశాఖకు రైలు బయలు దేరనున్నట్లు ప్రకటించింది.
"Salient Features of New Time Table with effect from 01st October - 2022" pic.twitter.com/WtHgfq5mSe
— South Central Railway (@SCRailwayIndia) September 30, 2022
అక్టోబర్ 2 మధ్యహ్నం 3.10 గంటలకు నర్సాపూర్ - యశ్వంత్ పూర్, అక్టోబర్ 3న మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి నర్సాపూర్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 25 వరకు పూర్ణ - పందార్పూర్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అక్టోబర్ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 9 గంటలకు పూర్ణలో ప్రత్యేక రైలు బయలు దేరనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 26వరకు పందార్పూర్ - పూర్ణ మధ్య 4 ప్రత్యేక రైల్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు పందార్పూర్ నుంచి రైల్లు బయలుదేరుతాయని వెల్లడించింది.
పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
దసరా పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. తెలంగాణలో అదనంగా 4198 అదనపు బస్సులను నడుపుతున్నట్టు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారమన్నారు. దసరా పండుగ సంబరాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానుండడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు 4 వేలకు పైగా బస్సుల నడిపేందుకు నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే, బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. మియాపూర్, కూకట్‌పల్లి, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్, కోఠి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీలోనూ స్పెషల్ బస్సెస్..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా రద్దీ తగ్గింది. కానీ ఈసారి రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తారని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ నెల 29 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతోంది. విజయవాడ నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, తిరుపతి, బెంగళూరు, భద్రాచలం, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాలకు కలిపి 1081 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. వీటిలో స్పెషల్ ఛార్జీలు వసూలు చేయడంలేదని ఆర్టీసీ తెలిపింది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది.