Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
Cyclonic Michaung live updates: మిగ్‌జాం తుపానుకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Background
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడిన తుపాను నెమ్మదిగా తీరంవైపునకు దూసుకొస్తోంది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ - ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా ఏర్పడిన తీవ్ర తుపాను మిగ్‌జాం గంటలకు 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి నెల్లూరుకు ఉత్తర-ఈశాన్యంగా 20 కి.మీ, చెన్నైకి ఉత్తరాన 170 కి.మీ, బాపట్లకు దక్షిణాన 150 కి.మీ, మచిలీపట్నానికి నైరుతి దిశలో 210 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఉత్తరం వైపు సమాంతరంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోంది. ఈ తెల్లవారు జామున బాపట్లకు దగ్గరగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
ఏపీలోలో 'మిగ్ జాం' (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ఈ ప్రభావంతో తిరుపతి (Tirupathi), నెల్లూరు (Nellore), ఉభయ గోదావరి, ప్రకాశం (Prakasam), కాకినాడ (Kakinada) జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తుపాను సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనుల కోసం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలని, ఇందుకోసం ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
వారికి రూ.10 వేల సాయం
తుపాను కారణంగా వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సహాయక శిబిరాల్లో ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మందులు, మంచినీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రూ.1,000 లేదా కుటుంబానికి రూ.2,500 ఇవ్వాలని ఆదేశించారు. శిబిరాలకు రాకుండా ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కిలో చొప్పున ఇవ్వాలని అన్నారు. అలాగే భారీ వర్షాలతో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అండగా నిలబడాలని అధికారులకు నిర్దేశించారు. పంట కోయని చోట్ల అలాగే ఉంచాలని, ఇప్పటికే కోసినట్లయితే ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటివరకూ 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని భద్రపరిచినట్లు అధికారులు సీఎంకు వివరించారు. తుపాను తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం ఇవ్వాలని చెప్పారు.
హెల్ప్ లైన్ నెంబర్లివే
'ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా'
మిగ్ జాం తుపాను ప్రభావం తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. శిబిరాల్లో బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
బాపట్ల వద్ద మిగ్ జాం తుపాను తీరం దాటింది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో 2 గంటల్లో తీవ్ర తుపాను అల్ప పీడనంగా బలహీన పడనుంది. తుపాను తీరం దాటినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాకినాడ, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
మిగ్‌జాం తుపాను కారణంగా రద్దు చేసిన ట్రైన్స్‌ను కొన్నింటిని పునరుద్దరించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 12710 నెంబర్‌తో సికింద్రాబాద్ గూడూరు మధ్య నడిచే ట్రైన్ పునరుద్ధించింది. 12733 నెంబర్‌తో నడిచే తిరుపతి లింగపల్లి మధ్య నడిచే ట్రైన్ ప్రారంభంకానుంది. 12764 నెంబర్‌తో సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే ట్రైన్ యధావిథిగా నడవనుంది. 17210 నెంబర్‌తో కాకినాడ టౌన్ ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య నడిచే ట్రైన్‌ను కూడా పునరుద్ధరించారు.





















