Rajouri Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి, బాంబు పేలుడులో చిన్నారి మృతి
Rajouri Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రదాడి జరిగింది.
Rajouri Terrorist Attack:
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. రాజౌరి ప్రాంతంలోనే మరోసారి అలజడి రేగింది. ఇప్పటికే ఇక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్పర్ డంగ్రీ గ్రామానికి చెందిన నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా...ఆరుగురు గాయాల పాలయ్యారు. మళ్లీ ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా...ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరో చోట కూడా IEDని గుర్తించినపోలీసులు...నిర్వీర్యం చేస్తున్నారు. కాల్పుల ఘటనలో సాధారణ పౌరులు చనిపోవడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. డంగ్రీలోని మెయిన్ చౌక్‌లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలోనే బాంబు పేలుడు సంభవించింది. " అధికారులు, పోలీసులు దాడులు జరగకుండా ఆపడంలో విఫలమయ్యారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇక్కడికి రావాలి. మా డిమాండ్‌లు వినాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడిపై మనోజ్ సిన్హా స్పందించారు. ఉగ్ర చర్యను ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు.
J-K: Child killed, 5 injured in suspected IED blast in Rajouri
— ANI Digital (@ani_digital) January 2, 2023
Read @ANI Story | https://t.co/OLZsQZ4qSN#JammuAndKashmir #IEDblast #Rajouri pic.twitter.com/P86XW3mhBG
ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్రం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే...అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంత్‌నాగ్‌లోని పహల్గామ్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ కమాండర్ ఆమిర్ ఖాన్ ఇంటిని బుల్డోజర్తో పడగొట్టేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ ఇల్లు కట్టినట్టు అధికారులు వెల్లడించారు. "గులాం నబీ ఖాన్ అలియాస్ ఆమిర్ ఖాన్ ఇల్లు కూల్చేశాం. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో ఆపరేషనల్ కమాండర్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో చాలా సార్లు పీఓకేని దాటుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే వాడు" అని తెలిపారు. అంతకు ముందు మరో ఉగ్రవాది ఇంటినీ కూల్చి వేశారు. పుల్వామాలోని రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆశిక్ అహ్మద్ నెంగ్రూ అలియాస్ అంజీద్ భాయ్ ఇంటిని పడగొట్టారు. ఇది కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిందేనని అధికారులు చెప్పారు. అంజీద్పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌లో భద్రతపై రాజీ పడేదే లేదని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సాధారణ పౌరులు ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా జీవించేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని ఆదేశించారు.
Also Read: Note Bandi SC Decision: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, మోడీ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనం