Rahul Pocso: రాహుల్‌పై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలంటున్న బీజేపీ.. అసలేం జరిగిందంటే..
అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలు అందరికీ తెలిసేలా ట్వీట్ చేసిన రాహుల్ గాంధీపై పోక్సో చోట్టం కింద కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి కారణం రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయడమే. ఢిల్లీ శివారులో ఓ బాలిక ను దుండగులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలియకుండా దహససంస్కారాలు చేశారు. ఈ అంశం సంచలనం సృష్టించడంతో ఆ బాలిక కుటుంబసభ్యుల్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డాటర్ ఆఫ్ దళిత్.. డాటర్ ఆఫ్ ఇండియాకు న్యాయం జరగాలసి ఇందులో రెండో అభిప్రాయం లేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడమని ప్రకటించారు.
రాహుల్ గాంధీ చేసిన ఆ ట్వీట్‌లో బాలిక ఫోటో కనిపించడంతో... బీజేపీ విమర్శలు ప్రారంభించింది. బాధితురాలైన బాలిక వ్యక్తిగత వివరాలను బయట పెడితే పోక్సో చట్టం (POCSO Act)లోని సెక్షన్ 23 కిందనేరమని తక్షణం రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని... బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. వీఐపీలకు అయినా చట్టం వర్తిస్తుందన్నారు. దళిత బాలికపై అఘాయిత్యం జరిగితే దాన్ని రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాసేపటికే.., జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ నోటీసులు జారీ చేసింది రాహుల్ గాంధీకి కాదు. ట్విట్టర్‌కు. ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ నేర పూరితమైన ట్వీట్‌ను పెట్టారని.. ఆయన పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్‌కు కేంద్రం ఇటీవల మధ్యవర్తి హోదా తొలగించడంతో ట్విట్టర్‌లో పెట్టిన ట్వీట్లన్నింటికీ ఆ సంస్థే బాధ్యత వహించాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ విషయంలోనూ ఆ సంస్థకే ఎన్‌డబ్యూసీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీలోకేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. పోలీసులు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటారు. అందులో గతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు అందరూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
అయితే మహిళలకు.. బాలికలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వారిపై అఘాయిత్యాలు జరిగేత బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తే చాలని అనుకుంటోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. రాహుల్ గాంధీపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తూంటంపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోంది. మరో వైపు బాలికపై దారుణానికి పాల్పడ్డారని నలుగుర్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.