Rahul Gandhi: మిస్ ఇండియాల్లో ఒక్కరైనా దళితులున్నారా - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Miss India: మిస్ ఇండియా విన్నర్స్‌లో ఒక్కరైనా దళితులున్నారా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ కామెంట్స్‌పై విరుచుకుపడుతోంది.
Rahul Gandhi on Miss India: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణన చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ మిస్ ఇండియా ప్రస్తావన తీసుకొచ్చారు. మిస్ ఇండియా విన్నర్స్‌లో కనీసం ఎవరైనా దళితులున్నారా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, OBC వర్గానికి చెందిన వాళ్లను మిస్ ఇండియా పోటీలకు దూరం పెడుతున్నారంటూ మండి పడ్డారు. ఈ వర్గానికి చెందిన మహిళల్లో 90% మంది వివక్ష ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అంతే కాదు. మీడియాలోనూ బడా యాంక్‌లు చెలామణి అవుతున్న మహిళల్లో ఎవరైనా దళిత వర్గానికి చెందిన వాళ్లున్నారా అని ప్రశ్నించారు.
"నేను మిస్ ఇండియా విన్నర్స్ లిస్ట్ పరిశీలించాను. వాళ్లలో ఎవరూ వెనకబడిన వర్గానికి చెందిన వాళ్లు లేరు. అందరూ బాలీవుడ్ స్టార్‌ల గురించి క్రికెట్ గురించి మాట్లాడతారు. వీళ్లను మాత్రం పట్టించుకోరు. మీడియాలో టాప్ యాంకర్స్‌గా చెలామణి అవుతున్న వారిలోనూ ఎక్కడా దళితులు కనిపించడం లేదు. ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన విషయం. 90% మందికి అందులో అసలు పోటీ చేయడానికే అవకాశం దక్కడం లేదు. నేను పదేపదే కులగణన చేయాలని చెప్పేది ఈ 90% మందికి న్యాయం జరగడానికే. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు. ఒకవేళ ఇలా అనడం వల్ల నేను రాజకీయంగా నష్టపోయినా పరవాలేదు. కానీ ఇది జరిగి తీరాలి"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
Now, He wants reservations in Miss India competitions, Films, sports! It is not only issue of "Bal Budhi", but people who cheer him are - equally responsible too!
— Kiren Rijiju (@KirenRijiju) August 25, 2024
बाल बुद्धि मनोरंजन के लिए अच्छी हो सकती है पर अपनी विभाजनकारी चालों में, हमारे पिछड़े समुदायों का मजाक न उड़ाएं। pic.twitter.com/9Vm7ITwMJX
లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ కుల గణన గురించి ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇది చేసి తీరతామని మేనిఫెస్టోలోనూ చేర్చింది. అయితే...రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మిస్ ఇండియా పోటీల్లోనూ రిజర్వేషన్‌లు తీసుకురావాలంటున్నారా అంటూ రాహుల్‌పై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. రాహుల్‌ది "పిల్లాడి బుద్ధి" అని చురకలు అంటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఆయనకి మద్దతుగా నిలిచిన వాళ్లదీ ఇలాంటి మనస్తత్వమే అనుకోవాల్సి వస్తుందని మండి పడ్డారు.