Polavaram Project: పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై చర్యలు తీసుకోవాల్సిందే - ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురికాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది. అలాగే నీటి సంవత్సరం మొత్తం స్పిల్ వే గేట్లతో పాటు రివర్ స్లూయిస్ కూడా తెరిచి ఉంచాలని సూచించింది. గోదావరి జలవివాద ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో ముంపు సమస్య లేకుండా చూడాలని వివరించింది. అందుకోసం తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పింది. ప్రాజెక్టు చేపట్టకముందే పరిస్థితి బాగుండేదని చెప్పుకొచ్చింది. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నది స్వేచ్ఛగా ప్రవహించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ రాశారు. ఇదే లేఖను కేంద్ర జలసంఘానికి కూడా పంపారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయించాలని కోరారు.
తెలంగాణ సర్కారు 2016 సంవత్సరం నుంచి సుధీర్ఘంగా చర్చలు జరుపుతూనే ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యపై తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించినట్లు వివరించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించిందన్నారు. బ్యాక్ వాటర్ ప్రభావం, స్థానిక వాగు నుంచి నీళ్లు నదిలోకి రాకుండా వెనక్కి నెట్టడంపైనా మరోసారి అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా సూచించినట్లు వెల్లడించారు. ఐటీసీ సారపాక, మణుగూర్ హవీ ప్లాంటు, భద్రాచలం పట్టణంతో పాటు చారిత్రక రామాలయంపై పడే ప్రభావానికి సంబంధించి ప్రాజెక్టు అథారిటీతో కలిసి సంయుక్త సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
సుప్రీం కోర్టు సూచించిన గడువులోగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు పరిష్కారం కాలేదని.. 2022-23లో భారీ వర్షాల కారణంగా రాష్ట్రం తీవ్ర ప్రభావానికి గురైందన్నారు. పోలవరం స్పిల్ వే పూర్తికావడంతో భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు 28 వేల ఎకరాలు నీట మునిగాయని గుర్తు చేశారు. అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయడం వల్ల వర్షానికి ముందుగానే ఉమ్మడి సర్వే చేయాలని సూచించినాపోలవం అథారిటీ పట్టించుకోలేదని లేఖలో వివరించారు. వానలు విస్తారంగా పడడం వల్ల గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో వెల్లడించారు.
పోలవరం తొలి దశ నిర్మాణానికి రూ.10,911 కోట్లు
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్ల, మరమ్మతుల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం చెప్పినట్లు జల్ శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశలో మిగిలిన పనులు పూర్తి చేయాలంటే రూ.17,144.06 కోట్లు కావాలని ఏపీ సర్కారు జూన్ 5, 2023 తేదీన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అదే రోజు కేంద్ర ఆర్థిక శాఖ రూ.12,911.15 కోట్లకు అనుమతి ఇస్తూ ఆఫీస్ మెమొరాండం పంపించింది. దీనిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని రాజ్యసభలో మంత్రి చెప్పుకొచ్చారు.