Patra Chawl Land Scam: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు, వరుసగా రెండోసారి
Patra Chawl Land Scam Case: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకూ పొడిగించారు.
Patra Chawl Land Scam Case:
సెప్టెంబర్ 19 వరకూ..
శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకూ పొడిగించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ PMLA కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పత్రాచాల్ ల్యాండ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రౌత్‌ను ఆగస్టు 8 వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టారు. ఆగస్టు 22 వరకూ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని అప్పుడే నిర్ణయించారు. ఇప్పుడు ఈ కస్టడీని ఇంకా పొడిగించారు. ఆగస్టు 4న PMLA కోర్టు కస్టడీని ఆగస్టు 8 వరకూ ఎక్స్‌టెండ్ చేసింది. ఇప్పుడు మరోసారి ఇదే పని చేసింది. ఆగస్టు 1న సంజయ్ రౌత్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఆయనపై సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఆయన భార్య వర్ష రౌత్‌నూ ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆగస్టు 6వ తేదీన ఆమెకూ సమన్లు జారీ అయ్యాయి. హౌజింగ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా..సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులు రూ.కోటి మేర లబ్ధి పొందారని ఈడీ చెబుతోంది. వర్ష రౌత్‌కు సంబంధించిన రూ.11.15కోట్ల విలువైన ఆస్తిపత్రాలను జత చేసింది ఈడీ. ఆమెతో పాటు సంజయ్ రౌత్ సన్నిహితులకూ ఈ అవినీతిలో హస్తం ఉందని ఈడీ అంటోంది.
#UPDATE | Mumbai: Special PMLA court extends Shiv Sena MP Sanjay Raut's judicial custody till 19th September, in the Patra Chawl land scam case. https://t.co/tOEHEsHB5k
— ANI (@ANI) September 5, 2022
పత్రా చాల్ స్కామ్‌లో అరెస్ట్
పత్రా చాల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కోర్టులో గతంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆయన, ఈడీ తనతో వ్యవహరించిన తీరుపై ఆగ్రహించారు. కిటికీలు, వెంటిలేషన్ లేని రూమ్‌లో తనను ఉంచారని అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ PMLAకి సంబంధించిన హియరింగ్స్ కోసం నియమించిన స్పెషల్ కోర్ట్ జడ్జ్‌కి ఇది వివరించారు సంజయ్ రౌత్. ఈడీపై ఏమైనా ఫిర్యాదులున్నాయా అని జడ్జ్ అడిగిన సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈడీ తరపున న్యాయవాదికి ఇందుకు వివరణ ఇచ్చారు. సంజయ్ రౌత్‌ను AC గదిలో ఉంచామని, అందుకే కిటికీ లేదని చెప్పారు. దీనిపై సంజయ్ రౌత్‌ను ప్రశ్నించగా.."తన గదిలో ఏసీ ఉందని, కానీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆన్ చేసుకోలేదని" అని అన్నారు. వెంటనే స్పందించిన ఈడీ, వెంటిలేషన్ ఉన్న గదిలోనే సంజయ్ రౌత్‌ను ఉంచుతామని స్పష్టం చేశారు. పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. భాజపా "బెదిరింపు" రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.