Noida Pet Policy: పెంపుడు కుక్క కరిస్తే యజమాని డబ్బు కట్టాల్సిందే, వైద్యం ఖర్చునీ భరించాలి - నోయిడాలో కొత్త రూల్స్
Noida Pet Policy: నోయిడాలో కుక్కలు, పిల్లులు పెంచుకునే వారికి షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు.
Noida Pet Policy:
నోయిడా అథారిటీ నిర్ణయాలు..
యూపీలోని నోయిడాలో కుక్కలు పెంచుకునే వాళ్లంతా ఇప్పటి నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలంటోంది ప్రభుత్వం. ఇటీవలే నోయిడా అధికారులు భేటీ అయి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుక్కలు, పిల్లులు పెంచుకునే వారికి షాక్ ఇచ్చారు. పెంపుడు జంతువుల కారణంగా ఎలాంటి ప్రమాదం జరిగినా...యజమానులకు భారీగా జరిమానాలు విధించాలని అధికారులు నిర్ణయించారు. రూ.10 వేల జరిమానాతో పాటు బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చునీ యజమానులే భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో వాళ్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఉదాహరణకు...పెంపుడు కుక్క ఓ వ్యక్తిని కరిస్తే...ఆ వ్యక్తి వైద్యానికి ఎంత ఖర్చవుతుందో అదంతా యజమాని తన జేబులో నుంచి పెట్టుకోవాలి. వీటితో పాటు మరి కొన్ని నిర్ణయాలూ తీసుకున్నారు. పెంపుడు పిల్లులు, కుక్కలను కచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఇలా రిజిస్టర్ చేయించుకోకపోతే...జరిమానా విధిస్తారు. వాటికి తప్పనిసరిగా వ్యాక్సిన్‌లు వేయించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా జరిమానా తప్పదు. అంతే కాదు. పెంపుడు జంతువులు బయటకు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేస్తే...యజమానులే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. నోయిడా అథారిటీ సీఈవో ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ కండిషన్స్ అన్నీ వరుసగా ట్వీట్‌లు చేశారు. బోర్డ్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. Animal Welfare Board of India సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
पालतू कुत्ते/बिल्ली के कारण किसी अप्रिय घटना की स्थिति में ₹10000/-आर्थिक दण्ड (दिनांक 01.03.2023 से) अधिरोपित किये जाने के साथ घायल व्यक्ति/जानवर का उपचार पालतू कुत्ते के मालिक द्वारा किया जायेगा।
— CEO, NOIDA Authority #IndiaFightsCorona (@CeoNoida) November 12, 2022
గతంలోనే ఆంక్షలు..
ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పిట్‌బుల్, రాట్‌వీలర్, డాగో అర్జెంటీనో జాతులకు చెందిన కుక్కల్ని పెంచుకోవడాన్ని నిషేధించింది. ఇక మిగతా శునకాలు పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలని తేల్చిచెప్పింది. నవంబర్ 1వ తేదీ నుంచి లైసెన్స్‌లు జారీ చేసింది. మరో రూల్ ఏంటంటే...ఒకటి కన్నా ఎక్కువ కుక్కల్నీ పెంచుకోకూడదు. కాంప్లెక్స్‌లలో నివసించే వాళ్లు తమ కుక్కల్ని సర్వీస్ లిఫ్ట్‌లో తీసుకురావాలని, అలా బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మూతికి తప్పనిసరిగా ముట్టెలు(నోరు తెరవకుండా కట్టేయటం) పెట్టాలని ఆదేశించింది. కొద్ది నెలలుగా ఘజియాబాద్‌లో కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు పెరగటం వల్లే మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర జాతులకు చెందిన కుక్కలు ఉన్న వాళ్లు రెండు నెలల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. Pit Bull, Rottweiler,Dogo Argentino కుక్కలున్న వాళ్లకు మాత్రం లైసెన్స్ ఇవ్వరు. ఇకపైన ఎవరు కొనుగోలు చేసినా...దాడులు జరిగినా యజమానులదే పూర్తి బాధ్యత. ఇప్పటికే ఈ కుక్కలున్న వాళ్లు రెండు నెలల్లోగా వాటికి "సంతాన నియంత్రణ" ఆపరేషన్ చేయించాలని తేల్చి చెప్పారు. ఈ మధ్య కాలంలోనే దాదాపు 10 మంది చిన్నారులపై కుక్కలు దాడులు చేశాయి. ఓ బాలుడిని పిట్‌బుల్ జాతికి చెందిన కుక్క దాడి చేయగా...ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. 150 కుట్లు వేయాల్సి వచ్చింది. ఇది జరిగిన నాలుగు రోజులకే మరో బాలుడిపై దాడి జరిగింది.
Also Read: Nalini Sriharan Release : రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళిని రిలీజ్ - 31 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ