Masala Powders: ఆ మసాలా పౌడర్‌లు హానికరం కావు, తేల్చి చెప్పిన ఫుడ్ సేఫ్‌టీ సంస్థ
MDH Masala: ఎవరెస్ట్, MDH మసాలా పౌడర్‌లలో ఎలాంటి హానికర రసాయనాలు లేవని, తాము టెస్ట్ చేశామని FSSAI వెల్లడించింది.
FSSAI Report on Everest MDH Spices: భారత్‌కి చెందిన MDH,ఎవరెస్ట్ మసాలా పౌడర్‌లలో క్యాన్సర్ కారకమైన ఇథిలీన్ ఆక్సైడ్ రసాయనం ఉందంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ ప్రభుత్వాలు మార్కెట్‌లో వాటి విక్రయంపై నిషేధం విధించింది. భారత్ నుంచి దిగుమతులూ నిలిపివేశాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భారత్ ఆ ఆరోపణలు నిజమా కాదా తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు Food Safety and Standards Authority of India (FSSAI) వీటిని పరీక్షించింది. దేశవ్యాప్తంగా 28 ల్యాబ్‌లలో శాంపిల్స్‌ని టెస్ట్ చేసిన సంస్థ ఆ మసాలా పౌడర్‌లో ఎలాంటి హానికర రసాయనాలు లేవని తేల్చి చెప్పింది. సింగపూర్, హాంగ్‌కాంగ్ చెబుతున్నట్టుగా అందులో ethylene oxide ఏమీ లేదని స్పష్టం చేసింది. అయితే...మరో 6 ల్యాబ్‌లలో పరీక్షలు కొనసాగుతున్నాయని, వాటి రిపోర్ట్ కూడా రావాల్సి ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకైతే అందులో ఎలాంటి రసాయనాలు కనిపించలేదని తెలిపింది. గత నెల నుంచే శాంపిల్స్‌ని సేకరించడం మొదలు పెట్టింది FSSAI.ఎవరెస్ట్, MDHతో పాటు అన్ని కంపెనీల మసాలా పౌడర్‌లను పరీక్షించింది. ఆ తరవాతే ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికే హాంగ్‌కాంగ్ ప్రభుత్వం తాము కూడా అన్ని విధాలుగా ఈ మసాలాని టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతానికైతే ఎక్కడా మార్కెట్‌లో వాటిని విక్రయించకూడదని ఆదేశించింది. పరిమితికి మించి ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని కారణం చెప్పింది.
ఏప్రిల్ 22 నుంచి టెస్ట్‌లు..
MDHకి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, సాంబార్ మసాలా పౌడర్‌లలో ఈ రసాయనం ఉందని వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 22 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాలా పౌడర్‌లను పరీక్షించే డ్రైవ్‌ని మొదలు పెట్టారు. వీటిని తయారు చేస్తున్న యూనిట్స్‌కి వెళ్లి అక్కడ నమూనాలు సేకరించడంతో పాటు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్యాకెట్స్‌ని టెస్ట్ చేయడం వరకూ అన్నీ చాలా పకడ్బందీగా చేశారు. Everest సంస్థకి చెందిన మసాలా పౌడర్‌లను రెండు యూనిట్స్ నుంచి సేకరించారు. అటు MDH కి చెందిన యూనిట్స్‌లో దాదాపు 25 శాంపిల్స్ సేకరించారు. ప్రమాణాలకు తగిన విధంగా వీటిని తయారు చేశారా లేదా అని పరీక్షించారు. ముఖ్యంగా Ethylene Oxide ఉందా లేదా అని టెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్ట్స్‌లో ఎక్కడా ఇది కనిపించలేదని వెల్లడించారు. మొత్తంగా 300 నమూనాలు పరీక్షించిన తరవాతే ఈ ఫలితాలు విడుదల చేసినట్టు స్పష్టం చేశారు. గుజరాత్, ముంబయి, లక్నో, అసోం, కేరళకి చెందిన అధికారులు ఈ టెస్ట్‌లు నిర్వహించారు. అటు Spice Board కూడా ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటిని వినియోగించకూడదని తేల్చి చెప్పింది. మిగతా రిపోర్ట్‌లు కూడా వచ్చిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైతే అందులో ఎలాంటి కెమికల్స్ గుర్తించలేదని తెలిపారు.
Also Read: Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి