నేనెప్పుడూ బీఫ్ తినలేదు, హిందువునని గర్వపడుతున్నా - కంగనా రనౌత్
Kangana Ranaut: తాను బీఫ్ తిన్నానని వస్తున్న ఆరోపణల్ని కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు.
Kangana Ranaut Comments on Beef Consuming: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఆమె పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే...ఆమెపై కొందరు విమర్శలూ మొదలు పెట్టారు. ఒకప్పుడు కంగనా రనౌత్ బీఫ్ తినేదని, ఇప్పుడు హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పారు. తనను తాను హిందువు అని చెప్పుకోడానికి చాలా గర్వపడతానని స్పష్టం చేశారు. X వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి ఆ ఆరోపణల్ని ఖండించారు.
"నేను ఎప్పుడూ బీఫ్ తినలేదు. తినను కూడా. మరే ఇతర మాంసాన్నీ నేను రుచి చూడలేదు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఎన్నో దశాబ్దాలుగా నేను యోగా, ఆయుర్వేద జీవన విధానాల గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. ఇలాంటి ఆరోపణలతో నా ఇమేజ్‌ని డ్యామేజ్ చేయలేరు. నా గురించి అందరికీ తెలుసు. ఎవరినీ తప్పుదోవ పట్టించలేరు. జై శ్రీరామ్"
- కంగనా రనౌత్
కాంగ్రెస్ నేత విజయ్ వదెట్టివర్ కంగనాపై ఈ ఆరోపణలు చేశారు. ఒకప్పుడు కంగనా బీఫ్ తిని చాలా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని, ఇప్పుడు ఆమెకే బీజేపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. అవినీతి నేతలకు ఆ పార్టీ ఆహ్వానం పలుకుతోందని ఆరోపించారు.