Medaram Jatara: మేడారం జాతరకు వేలల్లో స్పెషల్ బస్సులు, మహిళలకు ఫ్రీ టికెట్ వర్తిస్తుందా?
Telangana News: మేడారం జాతరకు ఆర్టీసి ప్రత్యేక కార్యాచరణతో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తోంది.
Sammakka Saralamma Jatara: గిరిజన కుంభమేళ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మెజార్టీ భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా మేడారానికి తరలివెళ్తారు. అయితే ఈసారి జాతరకు మహాలక్ష్మి ఫ్రీ బస్సు ఎఫెక్ట్ పడుతుంది.
మేడారం జాతరకు ఆర్టీసి ప్రత్యేక కార్యాచరణతో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు వనదేవతల జాతర జరగనుంది. జాతర భక్తులను చేర వేసేందుకు వారం రోజుల ముందు నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైరాబాద్, మహారాష్ట్ర నుంచి బస్సులు నడిపేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 పాయింట్ల ను ఏర్పాటు చేసి 6వేల బస్సులను నడపనుంది. అయితే ఈసారి జాతర కు మహలక్ష్మి పథకం ప్రభావం చూపుతుంది.
మహిళలకు ఫ్రీ బస్ కావడంతో మేడారానికి బస్సు ల కొరత ఏర్పడింది. జాతరకు వరంగల్ రీజియన్ తో పాటు ఇతర డిపోల బస్సులను తీసుకువచ్చి స్పెషల్ సర్వీస్ లను నడిపేది. ఈ సారి ఆయా డిపోల బస్సులను జాతర కోసం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. లోకల్ గా తిరిగే మహిళల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే అభ్యంతరాలు తెలుపుతున్నారు ఆయా డిపోల అధికారులు. 2022 జాతరకు 4వేల బస్సుల ద్వారా సుమారు 30 లక్షల భక్తులను చేరవేసామని. ఈ సారి 6 వేల బస్సులకు ప్రణాళిక రూపొందిచామని ఆర్టీసి వరంగల్ రీజినల్ అధికారి శ్రీలత చెప్పారు. నిర్దేశిత బస్సుల్లో మహలక్ష్మి పథకం మహిళలకు వర్తిస్తుందని ఆమె చెప్పారు.
ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో మేడారంకు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తులు పోటెత్తుతారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ పాయింట్లతో పాటు మేడారం లో బస్టాండ్, పార్కింగ్ పాయింట్ల ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని ఆర్ ఎం ఓ శ్రీలత చెప్పారు. జాతర కోసం 15 వేల మంది ఆర్టీసి సిబ్బంది పనిచేనున్నరని ఆర్ ఎం ఓ తెలిపారు.