Lok Sabha Elections 2024 Results: ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, NDA ఆశలు గల్లంతు - ఫలితాల టాప్ 5 కీలక అప్‌డేట్స్ ఇవే
Lok Sabha Elections 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన టాప్ 5 కీలక అప్‌డేట్స్ ఇవే.
Elections 2024 Results: ఎప్పటిలాగే బీజేపీయే మళ్లీ భారీ మెజార్టీతో దూసుకుపోతుందని అనుకున్నారు. మొదటి రౌండ్ నుంచే ఆ పార్టీ ఆధిక్యంలో ఉంటుందనే భావించారు. కానీ...ఆ అంచనాలను తలకిందులు చేస్తూ I.N.D.I.A కూటమి రేసులోకి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా NDA కూటమికి గట్టి పోటీనిచ్చింది. బీజేపీ 400 లక్ష్యం నీరుగారడం వల్ల అటు స్టాక్ మార్కెట్‌లోనూ జోరు తగ్గిపోయింది. అటు కాంగ్రెస్ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి గట్టిగానే పుంజుకుంది. రాహుల్ నేతృత్వంలో బలపడింది. ఎప్పుడూ లేని స్థాయిలో 100 సీట్ల మార్క్‌ని చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యూపీ, మహారాష్ట్రలో NDA కూటమి భంగపడింది. కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్‌లో జోరు తగ్గింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం NDA కూటమి 296 చోట్ల లీడ్‌లో ఉండగా ఇండీ కూటమి 229 చోట్ల ఆధిక్యంలో ఉంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల టాప్ 5 అప్‌డేట్స్
1. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న యూపీలో NDA జోరు తగ్గిపోయింది. ఇండీ కూటమి 42 చోట్ల లీడ్‌లో దూసుకుపోతోంది. బీజేపీ కేవలం 37 స్థానాల్లో లీడ్‌లో ఉంది. 2014లో యూపీలో బీజేపీ 71 స్థానాలు గెలుచుకోగా 2019లో 76చోట్ల గెలిచింది. ఈ సారి మాత్రం గట్టిగానే షాక్ తగిలింది.
2. ఒడిశాలో 21 ఎంపీ స్థానాలుండగా 19 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. నవీన్ పట్నాయక్ సీఎం కుర్చీకి ఎసరు తగిలేలా ఉంది. పాతికేళ్ల తరవాత తొలిసారి బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 143 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఒడిశాలో 73 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది.
3. ఈసారి మిత్రపక్షాలతో కలిసి ఆధిక్యం సాధించింది బీజేపీ. కానీ సొంతగా మాత్రం అనుకున్న స్థాయిలో మెజార్టీ రాబట్టుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో NDA 303 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ సొంతగా 224 చోట్ల గెలిచింది.
4. అటు మహారాష్ట్రలోనూ మహావికాస్ అఘాడాకి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. పార్టీలను చీల్చినప్పటకీ థాక్రే సేన, శరద్ పవార్ NCP ఈ సారి గట్టి ప్రభావాన్నే చూపించాయి. NDA వెనక్కి నెట్టి 29 చోట్ల లీడ్‌లో దూసుకుపోతోంది.
5. దాదాపు ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ NDA కి భారీ మెజార్టీ వస్తాయని తేల్చి చెప్పాయి. 370-401 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని అంచనా వేశాయి. కానీ...NDA కూటమి 295 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.