Jammu Kashmir: స్కూల్ బాగు చేయాలని రిక్వెస్ట్, చిన్నారి కల నెరవేర్చిన ప్రధాని మోదీ
Jammu Kashmir: స్కూల్ రిపేర్ చేయించాలని ఓ చిన్నారి చేసిన రిక్వెస్ట్‌ని ప్రధాని మోదీ అంగీకరించారు.
Jammu Kashmir School Repair:
చిన్నారి వీడియో వైరల్
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ చిన్నారి తన స్కూల్ ఏమీ బాగోలేదని, పెచ్చులు ఊడి పడుతున్నాయంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. వెంటనే బడిని బాగు చేయించాలని ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ సాయం కోరింది. ఈ మూడో తరగతి విద్యార్థిని పోస్ట్ తెగ వైరల్ అయింది. మొత్తానికి ఆమె రిక్వెస్ట్‌ని ప్రధాని యాక్సెప్ట్ చేశారు. వెంటనే అధికారులను పంపి ఆ స్కూల్ స్థితిగతులను పరిశీలించాలని ఆదేశించారు. చిన్నారి సీరత్ నాజ్ పోస్ట్ చేసిన ఈ వీడియో జమ్ముకశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శంకర్ శర్మ దృష్టికి వెళ్లింది. లోహాయ్ మల్హర్ బ్లాక్‌లోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్‌ని వెంటనే సందర్శించారు. బాగు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. రూ.91 లక్షలతో స్కూల్‌ని రిపేర్ చేయించనున్నారు. అయితే...ఇలా శిథిలమవుతున్న పాఠశాలలు ఇంకా ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ బాగు చేసేందుకు పూర్తి స్థాయి నివేదిక తయారు చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఈ ఇన్ని స్కూళ్లలోనూ మెరుగైన వసతులు కల్పించాలని చూస్తున్నట్టు చెప్పారు.
"ఈ స్కూల్‌ని బాగు చేసేందుకు రూ.91 లక్షల నిధులు కేటాయించాం. నిజానికి ఈ పని ఎప్పుడో పూర్తవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాం. పనులు జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదు. జమ్ముకశ్మీర్‌లో మారుమూల ప్రాంతాల్లో చాలా బడుల పరిస్థితి ఇలాగే ఉంది. వాటన్నింటినీ ప్రభుత్వం గుర్తించింది. వీలైనంత త్వరగా ఈ స్కూల్స్‌లో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం."
- అధికారులు
This cutest request by Seerat Naaz noticed by @narendramodi Ji work of her school has started 😁🙏💕 pic.twitter.com/0eLIA9xEwr
— Superastar Raj 🇮🇳 (@NagpurKaRajini) April 19, 2023
జమ్ము ప్రావిన్స్‌లో కొత్త కిండర్‌గార్టెన్స్‌ని నిర్మిస్తున్నామని..మరో మూడు నాలుగేళ్లలో వీటిని బాగు చేస్తామని హామీ ఇచ్చారు.
"జమ్ము ప్రావిన్స్‌లో కొత్తగా వెయ్యి కిండర్‌గార్డెన్స్‌ని నిర్మిస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ వీటి నిర్మాణం కొనసాగుతోంది. వచ్చే మూడు నాలుగేళ్లలో ఇవి రెడీ అయిపోతాయి. ప్రతి జిల్లాలో వీటిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం"
- అధికారులు
వారం రోజుల కింద ఈ వీడియోని పోస్ట్ చేసింది చిన్నారి. అందరి మాటలూ వినే ప్రధాని..తన మాటనూ వినాలంటూ చాలా క్యూట్‌గా అడిగింది. దాదాపు 4 నిముషాల వీడియోని పోస్ట్ చేసింది.
"మోదీజీ ఎలా ఉన్నారు..? మీరు అందరి మాటా వింటారు. నా మాట కూడా వినండి. మా కోసం ఓ మంచి స్కూల్ కట్టించండి. అలా అయితేనే మేం చదువుకోగలం. మా స్కూల్ అస్సలు బాలేదు. దుమ్ము కొట్టుకుపోతోంది. మా బట్టలు పాడవుతున్నాయని అమ్మ తిడుతోంది. మా అమ్మ తిట్టకుండా ఉండాలంటే ఈ స్కూల్‌ని బాగు చేయించాలి"
- సీరత్ నాజ్